ఆగస్టులో ముఖం చాటేసిన వరుణుడు..122 ఏళ్లలో అతి తక్కువ వర్షపాతం
X
నైరుతి రుతుపవనాల ప్రభావంతో జులై నెలలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. చాలా రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కన్నా అధికంగా నమోదైంది. అయితే ఆగస్టులో మాత్రం వరుణుడు ముఖం చాటేసాడు. ఎండలు ఓ రేంజ్లో మండిపోయాయి. ఎల్‌నినో ప్రభావంతో గత నెల అతి తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని రైతులు వానల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అయితే గడిచిన 122 ఏళ్లలో ఆగస్టు మాసంలో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడం ఇదేనని భారత వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ ఆగస్టు నెలలో 162.70 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని చెప్పింది. దీనికి సంబంధించిన గ్రాఫ్‌లను కూడా ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది.
భారత వాతావరణ శాఖ ప్రకారం 1901 అనంతరం దేశంలో ఇంత తక్కువ వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారి. సాధారణం కంటే 36 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1901 నుంచి చూసుకుంటే గడిచిన 122 ఏళ్లలో అత్యధికంగా 2021లో 194.30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. 1913లో 193.70 శాతం, 2009లో 193.50 శాతం, 1920లో 192.70 శాతం, 1965లో 192.30 శాతం, 2005లో 191.20 శాతంగా భారీ వర్షపాతం నమోదు అయ్యింది. అంతే కాదు అతి తక్కువ వర్షపాతం కారణంగానే ఉష్ణోగ్రతలు కూడా ఎన్నడూ లేని విధంగా అధికమయ్యాయని ఐఎండీ తెలిపింది.