బంగాళాఖాతంలో చిక్కుకున్న 36 మంది మత్స్యకారులు
X
అల్పపీడనం, వర్సాలు కారణంగా 36 మంది మత్స్యకారులు బంగాళాఖాతంలో చిక్కుకుపోయారు. వాళ్ళను కాపాడ్డానికి ఇండియన్ నేవీ 30 గంటలపాటూ శ్రమించాల్సి వచ్చింది. ఐఎన్ఎస్ ఖంజర్ సాయంతో వీరిని రెస్క్యూ చేశారు.
చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు రోజుల పాటూ నడి సముద్రంలో చిక్కుకుపోయారు. తమిళనాడులోని నాగపట్టణం తీరం నుంచి వీరు బయలు దేరారు. మొత్తం మూడు పడవల్లో 36 మంది చేపల వేటకు బయలుదేరి వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళాక వాతావరణం పరిస్థితులు మారిపోయాయి. దానికి తోడు పడవల్లో ఇంధనం అయిపోయింది. ఇంజిన్ సమస్యలూ తలెత్తాయి. దాంతో వారు అక్కడే ఎటూ కదల్లేకుండా ఉండిపోయారు. అలా రెండు రోజులు ఉండిపోయారు.
మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు అని సమాచారం రాగానే నౌకాదళం అలర్ట్ అయింది. వెంటనే బంగాళాఖాతంలో విధుల్లో ఉన్న ఎన్ఐఎస్ ఖంజర్ ను సహాయక చర్యలకు పంపింది. 130 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న మూడు పడవలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మూడు బోట్లకు తాళ్ళు కట్టి లాక్కుంటూ చెన్నై హార్బర్ కు తీసుకువచ్చారు. దీనికి 30 గంటలకు పైగా సమయం పట్టింది. మత్స్యకారులు అందరూ సురక్షితంగానే ఉన్నారని నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మంధ్వాల్ చెప్పారు.