Vande Sadharan Express Soon :వందే భారత్ తరహాలో వందే సాధారణ్ రైళ్లు.. త్వరలో పట్టాలపై పరుగులు..
X
ప్రయాణికుల కోసం రైల్వే శాఖ మరో కొత్త రకం ట్రైన్లు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్లు పట్టాలెక్కనుండగా.. స్పూర్తితో సాధారణ ప్రయాణికుల కోసం వందే సాధారణ్ ట్రైన్లు అందుబాటులోకి తేనున్నారు. 22 కోచ్లతో ఈ నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ ట్రైన్లు పట్టాలెక్కనున్నాయి.
వందే సాధారణ్ ట్రైన్లలో ఒకేసారి 1,834 మంది ప్రయాణించే వీలుంది. ఈ రైళ్లలో బయో వాక్యూమ్ టాయిలెట్స్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఛార్జింగ్ పాయింట్లు తదితర ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. గ్రే, ఆరెంజ్ కలర్లో ఉన్న వందే సాధారణ్ లో 12 స్లీపర్ నాన్ ఏసీ, 8 జనరల్, 2 లగేజ్ కోచ్లు ఉండనున్నాయి. ఈ ట్రైన్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనున్నాయి.
తక్కువ మొత్తంతో దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్యాసింజర్లను దృష్టిలో పెట్టుకుని వందే సాధారణ్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మొట్టమొదటి వందే సాధారణ్ ఈ ఎక్స్ ప్రెస్ ఆదివారం ముంబైలో అడుగుపెట్టాయి. ట్రయల్ రన్ కోసం వాడీబండర్ యార్టులో ఉన్న ఈ ట్రైన్ ట్రయల్ రన్ త్వరలోనే ప్రారంభం కానుంది. తొలి రైలును ఢిల్లీ - ముంబై మధ్య నడపనుండగా.. రెండో రైలును ఎర్నాకుళం - గువాహటి మధ్య ప్రారంభించనున్నారు. తొలి దశలో 5 మార్గాల్లో వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెట్టనున్నారు. ఆ తర్వాత మరో 30 రూట్లలో వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.
తమిళనాడులోని చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే సాధారణ్ ట్రైన్ల ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో రైలు విలువ దాదాపు రూ.65 కోట్లు కాగా రైలుకు ఇరువైపుల లోకోమోటివ్ ఏర్పాటు చేస్తున్నారు. 400 వందే సాధారణ్ కోచ్‌లను తయారు చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.