51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ.. రైళ్ల రాకపోకలు ప్రారంభం
X
బాలాసోర్ : ఒడిశా బాలాసోర్లో ఘోర రైలు ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచాయి. ఒకవైపు సహాయకచర్యలు కొనసాగుతుండగానే మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 51 గంటల్లో ధ్వంసమైన ట్రాక్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దీంతో రైళ్ల రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
బాహనాగ్ వద్ద పునరుద్ధరించిన పట్టాలపై ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలి గూడ్సు రైలు రాకపోకలను రైల్వే మంత్రి ప్రారంభించారు. అది విశాఖ ఓడరేవు నుంచి రూర్కెలా ఉక్కు కర్మాగారానికి బొగ్గు తీసుకెళ్తోంది. వేగంగా రైల్వే లైనును పునరుద్ధరించిన సిబ్బందిని, అధికారులను ఆయన అభినందించారు. మరోవైపు సోమవారం ఉదయం నుంచి ప్యాసింజర్ ట్రైన్ల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. మరికొన్ని రైళ్లను ప్రయోగాత్మకంగా పంపించి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ట్రైన్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు.
#WATCH | Indian Railways has started running passenger trains on the tracks which were affected due to #TrainAccident in Odisha’s Balasore pic.twitter.com/E9NTCv1ieO
— ANI (@ANI) June 5, 2023
మూడు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ బోగీలు తుక్కుతుక్కయ్యాయి. వాటికి మరమ్మతులు చేసినా తిరిగి వినియోగించే పరిస్థితిలో లేవని అధికారులు చెప్పారు. రైళ్ల భాగాలు కొన్ని ఏకంగా మట్టిలో కూరుకుపోయాయి. ట్రాక్ పక్కన ఉన్న స్తంభాలు నేలమట్టమవడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన కొత్త వాటిని ఏర్పాటు చేశారు.
ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తైనా ప్రస్తుతానికి డీజిల్ రైళ్లు మాత్రమే నడుస్తాయని రైల్వే అధికారులు చెప్పారు. ఎలక్ట్రిక్ కేబుల్ పనులు పునరుద్ధరణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ పనులు పూర్తయ్యేందుకు మరో 3 రోజులు సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని రకాల రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.