Home > జాతీయం > కెనడాలో డ్రైవర్లు, హెల్పర్లుగా మారుతున్న ఇండియన్ స్టూడెంట్స్

కెనడాలో డ్రైవర్లు, హెల్పర్లుగా మారుతున్న ఇండియన్ స్టూడెంట్స్

కెనడాలో డ్రైవర్లు, హెల్పర్లుగా మారుతున్న ఇండియన్ స్టూడెంట్స్
X

కెనడా-భారత్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఖలీస్థానీ తీవ్రవాది నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని.. భారత్ పై చేసిన ఆరోపణలతో .. దౌత్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారతీయ విద్యార్థులు సరైన ఉద్యోగాలు దొరక్క తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. గతేడాది 2,26,450 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. అంతర్జాతీయ విద్యా సంబంధిత వేదిక ఎర్యుడెరా నివేదిక ప్రకారం.. కెనడాలో మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 807,750. వీరిలో 551,405 మందికి గతేడాది స్టడీ పెర్మిట్ వచ్చింది. వీరిలో దాదాపు సగం మంది భారతీయులు ఉన్నారు.

అక్కడి పరిస్థితులపై భారతీయ విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘ రెండు దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల కంటే నా ఫ్యూచర్ మీదే నాకు టెన్షన్ మొదలైంది.. . ఇక్కడ తీవ్రమైన ఉద్యోగాల కొరత నెలకొంది. నా ఎడ్యుకేషన్ పూర్తయ్యేసరికి నాకు జాబ్ దొరుకుతుందో లేదో తెలియడంలేదు’ అని ఓ భారతీయ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. టొరంటోలోని అనేక మంది భారత విద్యార్థులది ఇదే పరిస్థితి. ‘‘ఆరోగ్య సేవల విభాగంలో మెడికల్ డిగ్రీలు చేసిన పలువురు భారతీయ విద్యార్థుల దుర్భర పరిస్థితి నాకు తెలుసు.. వారికి మంచి వేతనాలు వచ్చే ఉద్యోగాలు దొరకడంలేదు. దీంతో అనేక మంది క్యాబ్‌లు నడుపుతూ, దుకాణాలు, రెస్టారెంట్లలో హెల్పర్లుగా పనిచేస్తూ తమ బిల్లులు కట్టుకుంటున్నారు.. ఇది మాకు చాలా క్లిష్టమైన పరిస్థితి’’ అని మయాంక్ అనే విద్యార్థి వాపోయాడు.

దీనికి తోడు టొరంటో దాని చుట్టుపక్కల నగరాల్లో ఉండే అత్యధిక జీవన వ్యయ పరిస్థితులు విద్యార్థులకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయి. దీంతో ఎక్కువ మంది నెలవారీ ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు ఇరుకైన గదుల్లో కాలం గడుపుతున్నారు. ‘ఇక్కడ చదువు పూర్తయిన తర్వాత మేము మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు పొంది.. భారత్‌లోని మా తల్లిదండ్రులు, కుటుంబాలకు అండగా నిలబడతామనే ఆశతో వచ్చాం... కానీ ఉద్యోగాలు లేవు.. జీవన వ్యయం, ఆరోగ్య సంరక్షణ ఇబ్బందిగా మారింతి.. మేము అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడుతున్నాం’ అని హరియాణాకు చెందిన మరో విద్యార్థి అన్నారు.




Updated : 9 Oct 2023 1:15 PM IST
Tags:    
Next Story
Share it
Top