మన దేశం అప్పు రూ.కోటిన్నర కోట్లు.. ఒక్కొక్కరిపై ఎంతంటే..!!
X
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో.. భారతదేశ అప్పు మూడింతలై.. రూ.155 లక్షల కోట్లకు (రూ.కోటిన్నర కోట్లు) చేరిందని కాంగ్రెస్ మండిపడింది. దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతె డిమాండ్ చేశారు. 2014లో మోదీ ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.100 లక్షల కోట్ల మేర అప్పుల భారం పెరిగిపోయిందన్నారు. ఆర్థిక దుస్థితికి మోదీ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని దుయ్యబట్టారు. ఈ రుణాలకు గాను ఏడాదికి రూ.11లక్షల కోట్ల వరకు వడ్డీల రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్నారు. 14 మంది ప్రధాన మంత్రులు 67 ఏళ్లలో రూ.55లక్షల కోట్ల అప్పులు చేస్తే...నరేంద్ర మోదీ హయాంలో ఏకంగా రూ.100 లక్షల కోట్ల రుణం భారాన్ని దేశ ప్రజలపై మోపారని ఆరోపించారు.
ప్రస్తుతం ప్రతి ఒక్క భారతీయుడిపై సగటున రూ.1.20లక్షల మేర అప్పు ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరాయని ఆక్షేపించారు. ప్రధాని మోదీ పాలనలో ప్రభుత్వం ప్రతి సెకనుకు రూ.4లక్షల మేర రుణం తీసుకోవాల్సి వస్తోందని, ఇది పేదలు, మధ్యతరగతి ప్రజల కోసమో కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతె ఆరోపించారు. ‘‘దేశ ఆర్థిక నిర్వహణ అంటే పత్రికల్లో పతాకశీర్షికల నిర్వహణ కాదు. టెలీప్రాంప్టర్లు, వాట్సాప్ ఫార్వార్డ్‌ల ద్వారా ఆర్థిక నిర్వహణ చేయలేరు’’ అని ఆమె ఎద్దేవా చేశారు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.