ఇందిరాగాంధీ గ్యాస్ సబ్సిడీ యోజన:.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్..
X
ప్రస్తుం గ్యాస్ సిలిండర్ కొనాలంటే రూ.1,000లకు పైనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు వంట గ్యాస్ భారంగా మారింది. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కీలక ప్రకటన చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం ఇందిరాగాంధీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం పేరుతో రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోని 14 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.60 కోట్లను బదిలీ చేశారు.
జైపూర్‌లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... ఇందిరాగాంధీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం ద్వారా ప్రస్తుతం రూ.1150 ఉన్న గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.500కే అందజేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు మహిళల ద్వారానే అమలవుతున్నాయని, వారిని కుటుంబ పెద్దలుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
రాయితీలు ఉచితాలు కాదని, ఈ పథకాల ద్వారా ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని, ఈ పథకాల ద్వారా వచ్చే పొదుపుతో లబ్ధిదారులు తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని, వారి చదువులకు, పోషణకు వెచ్చించవచ్చని అన్నారు. ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పించాలనే తన ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, పది పథకాలకు ప్రజలను చేర్చుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా మెహెన్‌గై రాహత్ క్యాంపులను (ద్రవ్యోల్బణ శిబిరాలు) ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు 1.43 కోట్ల కుటుంబాలు ఈ శిబిరాల ద్వారా అనుసంధానించబడ్డాయని గెహ్లాట్ చెప్పారు. అలాగే.. ప్రతి కుటుంబానికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్, హెల్త్ స్కీమ్ - చిరంజీవి స్వాస్థ్య బీమా పథకాలను అందించాలని యోచిస్తున్నారు. ఈ హెల్త్ బీమా కవరేజీ మొత్తాన్ని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹ 10 లక్షల నుండి ₹ 25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.