Marry Boyfriend: మనసు పడిన వ్యక్తి కోసం లింగ మార్పిడి.. ఆఖరిలో ట్విస్ట్
X
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం.. 700 కి.మీ. దాటి పక్క రాష్ట్రానికి వెళ్లిన వ్యక్తికి గట్టి షాక్ తగిలింది. ప్రేమించాడనుకున్న వ్యక్తి చేతిలో అన్ని రకాలుగా మోసపోయి చివరకు పోలీసులను ఆశ్రయించారు బాధిత వ్యక్తి. అసలు విషయం ఏంటంటే.. ఇండోర్‌లో నివాసముంటున్న 28 ఏళ్ల మగాడికి మూడు సంవత్సరాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు (Kanpur) చెందిన మరో మగాడు వైభవ్ శుక్లా(Vaibhav Shukla) తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. చాటింగులతో బలపడి, ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది.
ప్రేమమైకంలో ప్రియుడు వైభవ్ శుక్లా కోసం.. ఇండోర్ నుంచి కాన్పూర్ వచ్చాడా వ్యక్తి. ప్రేమకు హద్దుల్లేవని, ఎలాంటి బేధాల్లేవని, పెళ్లి చేసుకుంటానని చెప్పిన శుక్లా మాటలు నమ్మి.. వెంటనే లింగమార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారాడు. ఆ తర్వాత ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. అయితే.. మోజు తీరాక శుక్లా... పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఒకవేళ పెళ్లి చేసుకోమని తన వెంట పడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించింది.
లింగమార్పిడి తర్వాత తన ప్రియుడు వైభవ్ శుక్లా తనని మోసం చేశాడని, తన పట్ల అతడు అసహజ చర్యలకు కూడా పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో తాను ఎంతో డబ్బు వెచ్చించి లింగమార్పిడి చేయించుకున్నానని, అతని వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనని మోసం చేయడంతో పాటు వేధింపులకు గురి చేసిన శుక్లాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్లాపై ఐపీసీ సెక్షన్ 377, 506 కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.