Home > జాతీయం > మణిపూర్ అల్లర్లు.. చైనాపై ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన ఆరోపణలు

మణిపూర్ అల్లర్లు.. చైనాపై ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన ఆరోపణలు

మణిపూర్ అల్లర్లు.. చైనాపై ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన ఆరోపణలు
X

జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతోంది. గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఈ ఘర్షణల మాటున ఎన్నో అమానుష ఘటనలు జరుగుతున్నాయి. అవి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ యావత్ దేశాన్ని నివ్వెరపరుస్తున్నాయి. మెయితీలకు ఎస్టీ హోదా నిరసిస్తూ కుకీ, నాగాలు మొదలుపెట్టిన ఆందోళన ఆ తర్వాత హింసగా మారింది.

ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవాణె సంచలన ఆరోపణలు చేశారు. జాతీయ భద్రతా దృక్పథం అనే అంశంపై ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మణిపూర్ అల్లర్ల వెనుక విదేశీ హస్తం ఉందనే ఆరోపణలను కొట్టిపారేయలేమని.. కచ్చితంగా ఉందని అన్నారు. వివిధ తిరుగుబాటు సంస్థలకు చైనా సాయం అందిస్తుందని ఆరోపించారు. తిరుగుబాటుదారులకు చైనా సాయం ఎంతో కాలంగా కొనసాగుతోందని చెప్పారు.

మయన్మార్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణా సైతం ఎంతో కాలం సాగుతుందని నరవాణె తెలిపారు. ఇక ఈ హింస వల్ల లబ్ది సంస్థలు సైతం ఉండొచ్చని కామెంట్ చేశారు. అయితే శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. కాగా మణిపూర్ మంటల వెనుక మయన్మార్ నుంచి వచ్చే మత్తు ఉందనే ఆరోపణలు సైతం జోరుగా వినిపిస్తున్నాయి.

ప్రపంచంలోనే డ్రగ్స్ ఉత్పత్తిలో మయన్మార్ది రెండవ స్థానం. ఈ మత్తుకు మణిపూర్ అల్లర్లకు సంబంధం ఉందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మయన్మార్‌ - భారత్‌ మధ్య 1640 కి.మీ. సరిహద్దు ఉండగా.. ఇందులో 400 కి.మీ. మణిపుర్‌తోనే ఉంది. ఈ సరిహద్దులో పది శాతం భూభాగంలోనే కంచె ఉండగా.. మిగితా అంతా సాధారణ భద్రతే ఉంటుంది. కంచె లేని ప్రాంతం గుండా మయన్మార్ నుంచి మణిపూర్లోకి డ్రగ్స్ సరాఫరా అవుతుంటాయని సమాచారం.


Updated : 29 July 2023 1:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top