Ayodhya Ram Mandir : అయోధ్య రాముడితో బీజేపీ ఏం చేస్తోంది? ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే దేవుడు.. నినాదానికి ఈ ఆలయం సాక్షమా..?
X
ఇప్పుడు దేశమంలో ఎక్కడ చూసినా రామభజనే. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనతో దేశం మొత్తం కాషాయ జెండాలా రెపరెపలాడుతోంది. గల్లీ గల్లీలో అయోధ్య ఉత్సవాలు జరుగుతున్నాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ నుదుట సింధూరం ధరించి జైశ్రీరామ్ అని నినదిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ‘జై శ్రీరామ్’ అనే నినాదం ఇలా వీధుల్లోకి వచ్చి దేశాన్ని ఏకం చేసే సందడి చేయడం ఇదే తొలిసారి. నేటి అయోధ్య రామ్ లల్లా వేడుక ముందు 1990ల నాటి రామజన్మభూమి ఉద్యమం కూడా దిగదుడుపే!
అయితే రాముడి పేరుతో సాగుతున్న ఈ సందడి దేనికి సంకేతం? బీజేపీ, ఆరెసెస్స్ దశాబ్దాలుగా సాగిస్తున్న హిందుత్వ రాజకీయాలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయా? మనదేశ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వం భూకంపంలా బీటలు వారి అఖండ హిందూదేశం అవతరిస్తోందా? ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే దేవుడు.. నినాదానికి అయోధ్య ఆలయం సాక్షిగా ప్రాణప్రతిష్ట జరిగిందా? భిన్న మతాలకు, భిన్న సంస్కృతులకు, భిన్న భాషలకు నెలవైన అద్భుత భారతావనిలో ఓ వర్గం చెప్పిందే వేదం కానుందా? వేల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న విభిన్న ప్రజాసంస్కృతుల రంగుల సింగిడిని ఒకే వర్ణం కమ్మేయనుందా? నేటి భారతంలో ఈ ప్రశ్నలు కూడా బలంగానే ముందుకు వస్తున్నాయి.
బాలరాముడి ప్రతిష్టాపన వెనుకున్నది?:
ప్రస్తుత దేశ పరిణామాలకు మూలాలు చరిత్రలో ఉన్నాయి. 2024 జనవరి 22న అయోధ్యలో హిందువుల గుండెలు ఉప్పొంగేలా సాగిన బాలరాముడి ప్రతిష్టాపనకు వెనుక వందేళ్ల హిందుత్వ రాజకీయాల చరిత్ర ఉన్నదని కొంతమంది చరిత్రకారులు గుర్తుచేస్తున్నారు. సరిగ్గా వందేళ్ల కిందట 1924 జనవరిలో సంఘ్ పరివార్ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ అండమాన్ జైలు నుంచి విడుదలై బయటికి వస్తూ తోటి ఖైదీలకు ఓ మంత్రం బోధించాడు. ‘‘ఒకే దేవుడు, ఒకే దేశం, ఒకే లక్ష్యం, ఒకే కులం, ఒకే జీవితం.. ఒకే భాష.. ఈ ఆశయానికి మీరు అంకితం కండి’’ అన్నాడు. సావర్కర్ అజెండాను 1925లో ఏర్పడిన ఆరెస్సెస్ మరింత ముందుకు తీసుకెళ్లింది. ఒక పక్క బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు సహా అన్ని మతాల ప్రజలు ఏకతాటిపై వచ్చి ప్రాణాలను తెగించి స్వాతంత్ర పోరాటం చేస్తుంటే చాపకింద నీరులా హిందుత్వ రాజకీయాలు విస్తరించాయని కొంతమంది చరిత్రకారులు విమర్శిస్తారు.
స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత దేశంలో జరిగిన పరిణామాలు నాటి వర్తమానాన్నే కాదు నేటి భారతాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని కోరిన జాతిపిత మహాత్మా గాంధీ, గాడ్సే మతోన్మాదానికి బలవడంతో దేశం మొత్తం దుఖించింది. గాంధీ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లిన తొలి ప్రధాని నెహ్రూ నవభారతాన్ని ఆవిష్కరించి మనదేశ బహుళ సంస్కృతులను శాయశక్తులా కాపాడాడు. ఆయన మరణం తర్వాత దేశ పగ్గాలు అందుకున్న ఇందిరా గాంధీ కూడా దేశంలోని భిన్న సంస్కృతులకు అండగా నిలిచింది. ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఇందిరకు 1977 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధిచెప్పడంతో జనతా సర్కార్ గద్దెనెక్కింది. 1980లో మళ్లీ అధికారంలోకి వచ్చిన ఇందిర సిక్కుల తూటాలకు బలైంది. 1980లో జనసంఘ్ నేతలు బీజేపీని ఏర్పాటుచేసి హిందుత్వాన్ని సరికొత్తగా దేశ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టిందన్న వాదన ఉంది.
రాముడితో ఉన్న అనుబంధానికి రాజకీయ రంగు?:
ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల్లోకి వెళ్లడానికి ఓ సిద్ధాంతం కావాలి. కాంగ్రెస్ అజెండా సెక్యులరిజం అయితే కమ్యూనిస్టుల అజెండా సమసమాజం. అంబేద్కరిస్ట్ పార్టీల అజెండా కులనిర్మూలన అయితే బీజేపీ అజెండా హిందుత్వం. ఇంతకీ హిందుత్వం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ఇప్పటిదాకా ఎవరూ స్పష్టమైన నిర్వచనాన్ని ఇవ్వలేదు. హిందు ధర్మానికి ఆయువుపట్టులా ఉన్న ఓ వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించే రాముడు బీజేపీకి ఆరాధ్యుడు అయ్యాడన్న విమర్శలు ఆ పార్టీపై ఎప్పటినుంచో ఉన్నాయి. భారతీయులకు రాముడితో ఉన్న అనుబంధానికి బీజేపీ రాజకీయ రంగు పులిమి ఇవాళ తాను అనుకున్నది సాధించిందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి. అయితే ఇదంతా కేవలం బీజేపీ తలుచుకున్నందువల్లే సాధ్యమైందా? లేక దేశ పరిస్థితులే అలా ఉన్నాయా? సెక్యులరిజం అంటే మైనారిటీలను బుజ్జగించడం, హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీయడం అనే గానుగెద్దు ధోరణిలో సాగిన కాంగ్రెస్, కమ్యూనిస్టుల రాజకీయాలే కాషాయదళానికి బలమిచ్చాయా? మిగతా రాజకీయ పార్టీలు ప్రజలను ఏకం చేయడంలో విఫలం అవడంతోనే అయోధ్య సాక్షిగా ‘వన్ కంట్రీ, వన్ గాడ్, వన్ లాంగ్వేజ్’ ప్రోగ్రామ్‌కు పునాది పడిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.
స్వాతంత్ర్యం, గ్రామస్వరాజ్యం అంటూ మహాత్ముడు దేశాన్ని కాంగ్రెస్ గూటి కిందికి తీసుకొచ్చాడు. రాజీవ్ గాంధీ హత్య తరువాత లౌకిక స్ఫూర్తిని కొనసాగించడంలో విఫలం అయిందని కొంతమంది కాంగ్రెస్ ను విమర్శిస్తుంటారు. కాంగ్రెస్ పాలనలో కొన్ని సోషలిజం మెరుపులు కనిపించినా పేదరికం, నిరుద్యోగం బీభత్సంగా పెరిగాయి. ఫలితంగా ఆర్థిక సంస్కరణలు అనివార్యమయ్యాయి. కాంగ్రెస్, లెఫ్ట్ రాజకీయాలు నచ్చని జనం ప్రాంతీయ పార్టీలను ఆదరించారు. ఉత్తర భారతంలో బీజేపీ అలానే బలం పెంచుకుంది. 1990 నుంచి మన దేశం ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొంది. 1990లో లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్ర ఆ తరువాత 1992లో బాబ్రీ మస్జిద్ విధ్వంసంతో హిందుత్వ రాజకీయాలు మనదేశ రాజకీయ ముఖచిత్రంపై అనివార్యమయ్యాయి. అటల్ బిహారీ వాజపేయి సాఫ్ట్ హిందుత్వ ముఖంతో కొన్నాళ్లు కేంద్రంలో బీజేపీ అధికారం కొనసాగించిందని చెప్పుకోవచ్చు. అయితే 2002 గోధ్రా రైలు దహనం, అల్లర్లతో బీజేపీ, హిందూధర్మానికి నరేంద్ర మోడీ మాత్రమే రక్షకుడు అన్న వాదనకు క్రమంగా బలం పెరిగిందని మనదేశ రాజకీయాలను విశ్లేషించే వారు చెపుతుంటారు.
కాంగ్రెస్ అవినీతి బీజేపీకి కలిసొచ్చిందా?:
2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొత్తం అవినీతిమయమే అన్న నాటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ చెప్పిన మాటలను ఈ దేశ ప్రజలు బలంగా నమ్మారు. మోడీ ఛరిష్మాతోనే రెండో సారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ పదేళ్ల బీజేపీ పాలనలో హిందుత్వ రాజకీయాలు మర్రి ఊడల్లా పాతుకుపోయాయన్న ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఘర్ వాపసీ, గోరక్షణ్, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ట్రిపుల్ తలాక్ రద్దు, కశ్మీర్ స్వయంప్రతి రద్దు, పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్, ఉగ్రవాద నిర్మూలన వంటి ఎన్నో సంచలనాలకు మోదీ సర్కారు కేరాఫ్ అడ్రస్ అయింది. హిందువులకు అనుకూలంగా, మైనారిటీలకు వ్యతిరేకంగా దేశమంతా ఓ సంక్షుభిత వాతావరణాన్ని బీజేపీ నెలకొల్పిందన్న ఆరోపణలను ఎదుర్కుంటోంది. అయోధ్య వివాదాస్పద భూమిని హిందువులకు 2019లో సుప్రీం కోర్టు కేటాయించడం మోదీ సాధించిన ఘన విజయమే అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
భారతీయ సంస్కృతి భవిష్యత్తు ఏమిటి?:
తన భావజాలాన్ని ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో అడ్డంకిగా ఉన్న మనదేశ భిన్న సంస్కృతి, బహుళ భాషలు, ఆరాధనలను పక్కకు జరిపి భారత్ అంటే హిందువుల దేశమని, భారతీయుల భాష అంటే హిందీ అని, భారతీయుల దేవుడంటే శ్రీరాముడే అన్న స్పష్టమైన సంకేతాన్ని అయోధ్య బాలరాముడి విగ్రహం సాక్షిగా ప్రజల్లోకి బీజేపీ పంపిందన్న వాదన ఒకటి ఆ పార్టీని విమర్శించే వర్గాల నుంచి బలంగా వినిపిస్తుంది. ఇది నిజమేనా? వాస్తవమే అయితే ఇకపై ఏం జరగబోతోంది? ఎవరిది ఏ ప్రాంతమైనా, ఎవరిది ఏ మతమైనా, ఎవరిది ఏ భాష అయినా అన్నదమ్ముల్లా కలిసిమెలసి సాగిన విలక్షణ భారతీయ సంస్కృతి భవిష్యత్తు ఏమిటి? చరిత్రలో ఎన్నో సంక్షోభాలను, విధ్వంసాలను, మారణకాండలను ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కొన్న భారతీయులు ఇకముందూ అదే ఐక్యతను చాటుతారా? ఈ నేలలో పుట్టి ఈ నేలలో జీవిస్తూ భారతీయ బహుళత్వానికి ప్రతీకలైన మైనారిటీలు ఏకత్వ రాజకీయాలను ఆమోదిస్తారా? బౌద్ధం, జైనం, ఇస్లాం, క్రైస్తవం.. మరెన్నో మతాలతో, తెగలతో, వేల భాషలతో వేల ఏళ్లుగా సహజీవనం చేస్తూ సహనానికి మారుపేరుగా నిలిచిన హిందువులు.. తమ మతం కేంద్రంగా బీజేపీ సాగిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే దేవుడు’ రాజకీయాలను మనసారా అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలకు నేటి భారతం కాకపోయినా భవిష్యత్ భారతం తప్పక సమాధానం ఇస్తుందని, సహజీవన సంస్కృతి వెల్లివిరుస్తుందని ఆశిద్దాం!!