మేనకా గాంధీ సంచలన ఆరోపణలు.. బీజేపీ ఎంపీకి షాకిచ్చిన ఇస్కాన్
X
ఇస్కాన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి షాక్ తగిలింది. ఆమెపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మేనకాగాంధీకి నోటీసులు పంపింది. ఇస్కాన్ గోశాలల్లోని ఆవులను కసాయివాళ్లకు అమ్మేస్తున్నారంటూ మేనకా గాంధీ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ సభ్యులు సేవ పేరుతో దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
మేనకా గాంధీ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన ఇస్కాన్ అప్పుడే ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ ప్రకటించారు. మేనకా గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్న ఆయన.. ఆమె కామెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తుల మనోభావాలు దెబ్బతీశాయని అన్నారు.
మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద ఆరోపణ ఎలా చేస్తారని ఇస్కాన్ ప్రశ్నించింది. ఇటీవలే అనంతపూర్ లోని గోశాలకు వెళ్లానని ఆమె వీడియోలో చెప్పారని కానీ అక్కడి పనిచేస్తున్న వారు మాత్రం ఆమె వచ్చిన విషయమే తమకు తెలియదని అంటున్నారని అన్నారు. ఇంట్లో కూర్చొని ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాధారామ్ దాస్ మండిపడ్డారు.
బీజేపీ ఎంపీ మేనకాగాంధీ ఇటీవలే ఏపీలోని అనంతపురంలో ఉన్న గోశాలను సందర్శించినట్లు ఈ మధ్యన ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో అక్కడి గోశాలలో వట్టిపోయిన ఆవు ఒక్కటి కూడా కనిపించలేదని, దూడలు కూడా లేవని అన్నారు. గోశాలలో కనీసం ఒక్క ఆవు కూడా లేదంటే అక్కడి గోవుల్ని అమ్ముకుంటున్నట్లే కదా అని మేనకా గాంధీ ఆరోపించారు. ఆవుల్ని అమ్ముకుంటున్న ఇస్కాన్ .. రోడ్డు మీద మాత్రం హరే రామ హరే కృష్ణ అని భజన చేస్తోందని అన్నారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నామని చెప్పుకునే ఇస్కాన్ సభ్యులు అమ్మినంతగా మరెవరూ ఆవుల్ని కసాయి వాళ్లకు అమ్మరని ఆమె మండిపడ్డారు. మేనకా గాంధీ ఆరోపణలపై స్పందించిన ఇస్కాన్ అప్పుడే క్లారిటీ ఇచ్చింది. తాజాగా పరువు నష్టం దావా నోటీసులు పంపింది.