మణిపూర్ నిందితులను వదిలేది లేదు-ప్రధాని నరేంద్ర మోడీ
ఈ ఘటన దేశానికే సిగ్గుచేటు
X
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన మీద ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ ఘటన దేశానికే సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు వర్షాకాలం సమావేశాలకు ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు.
మణిపూర్ లో మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తించడం తన హృదయాన్ని కలిచివేసిందని చెప్పారు ప్రధాని మోడీ. ఈ ఘటన 140 కోట్ల భారతీయులు సిగ్గుతో తలదించుకునేలా చేసిందని అన్నారు. ఆ మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ క్షమించేది లేదని....నిందితులకు శిక్ష పడేంతవరకు ఊరుకునేది లేదని ఆయన చెప్పారు. వారిని శిక్షించేందుకు చట్టం పూర్తిశక్తితో పనిచేస్తుందని హామీ ఇచ్చారు.మహిళల భద్రత విషయంలో రాజీపడబోమని అన్నారు. ఈ ఘటన మీద రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. మే4న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అనంతరం పార్లమెంటు వర్షాకాల సమావేశాల గురించి మాట్లాడుతూ...సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలని మోడీ కోరారు. ప్రజా సమస్యను చర్చించేందుకు తమ ప్రభుత్వం, నాయకులు సిద్ధంగా ఉన్నారని...ప్రతీదానికి టైమ్ దొరుకుతుందని ఆయన చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఈ సమావేశాల్లో తీసుకువస్తున్నామని అన్నారు.