Home > జాతీయం > కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుకు నాలుగేళ్లు.. ఆశించిందే జరిగిందా?

కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుకు నాలుగేళ్లు.. ఆశించిందే జరిగిందా?

కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుకు నాలుగేళ్లు.. ఆశించిందే జరిగిందా?
X

నిత్యం ఉగ్రవాదుల చొరబాట్లు, ఎన్‌కౌంటర్లు, ఆర్మీ వాహనాలపై ముష్కరుల రాళ్ల దాడులు, అరెస్టులతో యుద్ధభూమిని తలపించిన జమ్మూకశ్మీర్ పరిస్థితి ఇప్పుడెలా ఉంది? ఆశించిన మార్పులు వచ్చాయా? చేసింది ఎంత? చేయాల్సింది మరెంత? జేకేకి స్వయంప్రతిపత్తి కల్పించిన 370వ రాజ్యాంగ అధికరణను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసి శనివారంతో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో భారత ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాలు ఏమేరకు నెరవేరాయి? ఉగ్రవాద నిర్మూలన, పర్యాటక రంగం అభివృద్ధి, కశ్మీరీలకు ఉపాధి వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం సాధించిందేమిటి?

కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, అభివృద్ధి పేరుత కేంద్రం 2019 ఆగస్ట్ 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ- కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. కేంద్రం ఆశించినట్లే ఈ నాలుగేళ్లలో ఉద్రవాద దాడులు, అల్లర్లు గణనీయంగా తగ్గాయి. పర్యాటక రంగం పుంజుకుంది. సినిమా షూటింగులు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే సరిహద్దుల్లో మాత్రం తరచూ తూటాలు పేలుతూనే ఉన్నాయి. అంతర్గత శాంతిభద్రతలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించినా అంతర్జాతీయ సరిహద్దులో మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. జేకే బార్డర్ ఇటు భారత రాజకీయాలతో, అటు పాకిస్తాన్ రాజకీయాలతో సెంటిమెంటల్‌గా ముడిపడి ఉండడంతో నిత్యం ఏదో ఒక అలజడి సాగుతూనే ఉంది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం జరిగాయంటే..

• అధికారిక లెక్కలు ప్రకారం.. అల్లర్లు, రాళ్ల దాడులు భారీ స్థాయిలో తగ్గాయి. 2016-2019 మధ్య భద్రతా బలగానే 124 మంది పౌరులు చనిపోగా, గత నాలుగేళ్లలో ఒక్క పౌరుడూ చనిపోలేదు.

• ఉగ్రవాదుల్లో చేరే కశ్మీర్ యువకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు వందల్లో రిక్రూట్‌మెంట్ సాగగా ఇప్పుడు పదుల సంఖ్యకే పరిమితమైంది. ఈ ఏడాది జూలై నాటికి కేవలం 12 మందే చేరారు.

• సరిహద్దులో చొరబాట్లు కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. ఎన్‌కౌంటర్లలలో హతమవుతున్నవారి సంఖ్య కూడా తగ్గింది. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 120 మంది చనిపోగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 32 మంది హతమయ్యారు. పాకిస్తాన్ నేతలు అంతర్జతీయ వేదికలపై కశ్మీర్ అంశంపై వివాదాన్ని ప్రస్తావించడం తగ్గింది.

• యువత విద్య, ఉపాధిపై దృష్టిపెట్టింది. కశ్మీర్ నుంచి ఇతర రాష్ట్రాలకు చదువుల కోసం వెళ్తున్నారు. గత నాలుగేళ్లలో కేంద్రం 29 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. 15-29 ఏళ్ల మధ్య వయసు యువతలో నిరుద్యోగం 18 శాతానికి తగ్గింది.

• ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో పెట్టుబడులు భారీస్థాయిలో పెరిగాయి. రూ. 25 వేల కోట్ల విలువైన ప్రైవేట్ పెట్టుబడి ప్రాజెక్టుల పనులు సాగుతుండగా మరో 80 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు అనుమతుల స్థాయిలో ఉన్నాయి. కశ్మీర్ భారత్‌లో విలీనమైంది మొదలు 2019 వరకు కేవలం 14 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

• దేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భద్రతను పటిష్టం చేయడంతో మారుమూల ప్రాంతాలకు సైతం ప్రయాణాలు సాగుతున్నాయి. గత ఏడు నెలల్లో 1.27 కోట్ల మంది పర్యటించారు. కేవలం హనీమూన్‌కే కాకుండా ఇతర విందువినోదాల కోసమూ హిమగిరి శిఖరాలకు వస్తున్నారు. 30 ఏళ్ల విరామం తర్వాత సినిమా హాళ్లు కూడా తిరిగి తెరుచుకున్నాయి. అమర్‌నాథ్ యాత్ర సహా పలు ఆలయాలకు భక్తులు భయం లేకుండా వెళ్తున్నారు.

• ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి ఆర్టికల్ 370 రద్దు తర్వాతే సాకారమైంది. చీనాబ్‌నదిపై ఈఫిల్ టవర్ కన్నా 29 మీటర్ల ఎక్కువ ఎత్తుతో నిర్మించారు. ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్ ట్యూబ్ హైవే కూడా నిర్మాణమైంది.

సాధించాల్సినవి ఇవీ

• కశ్మీరీలు తమకు ప్రత్యేక హోదా పోవడంతో ఏదో నష్టపోయామనే భావనతో ఉన్నారు. జేకేను మరింత అభివృద్ధి చేసి, వారిలో భారత ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని మరింత పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉంది.

• ఉపాధి అవకాశాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ప్రైవేటు పెట్టుబడులతో పోలిస్తే ప్రభుత్వం వైపు నుంచి మౌలిక సదుపాయాలు మరింతగా విస్తరించాల్సి ఉంది.

• రాజకీయ స్వేచ్ఛపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పార్టీల నేతల గృహనిర్బంధాలు, సభలకు అనుమతుల నిరాకరణ, నిఘా ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి.





Updated : 6 Aug 2023 3:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top