బీజేపీతో చేతులు కలిపిన కుమారస్వామి.. కేసీఆర్‌కు హ్యాండిచ్చిన దోస్త్
X
కర్నాటక చిన్న విపక్షం జేడీఎస్ కాషాయంతో జట్టు కట్టింది. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరంగా ఉంటామని చెబుతూ వస్తున్న మాజీ సీఎం కుమారస్వామి ‘విధిలేని’ పరిస్థితిలో ఎన్డీఏ గూటికి చేరారు. బీజేపీ తమను నమ్మడం లేదంటూ మొన్నటి వరకు వాపోయిన ఆయన దానితోనే దోస్తానీకి సై అయ్యారు. ‘‘కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ విపక్షాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడడానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. తుది నిర్ణయం తీసుకోవాలని అధినేత దేవెగౌడ నాకు చెప్పారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీతో కలసి పనిచేయాలని నిర్ణయించాం’ అని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా అని విలేకర్లు అడగ్గా, సూటిగా జవాబు చెప్పకుండా కలసి పనిచేయాలని మాత్రమే నిర్ణయించామని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే బరిలోకి దిగి 19 సీట్లు సంపాదించుకుంది. కాంగ్రెస్, బీజేపీల్లో ఏది గెలిచినా తమ మద్దతు అవసరం ఉంటుందని, కింగ్ మేకర్‌ను అవుతానని కుమారస్వామి అనుకున్నారు. అయితే కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలడంతో బీజేపీవైపు మొగ్గు చూపారు.
కుమారస్వామి నిర్ణయంతో తెలంగాణ అధికార బీఆర్ఎస్ పార్టీకి కర్నాటకలో మిత్రపక్షం లేకుండా పోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలసి పనిచేస్తామని కుమారస్వామి చాలాసార్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. ఆయన నిలకడ లేని మనిషి అని కేసీఆర్‌కు అర్థమై ప్రధాన దృష్టిని మహారాష్ట్రవైపు సారించినట్లు కనిపిస్తోంది. తమ ఫస్ట్ టార్గెట్ కర్నాటక అని చెప్పిన కేసీఆర్ తర్వాత ఆ సంగతి ప్రస్తావించలేదు.