Champai Soren : రేపు అసెంబ్లీలో బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు
X
(Champai Soren) జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ కూటమి బలపరీక్షకు సిద్ధమైంది. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోనుంది. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆదేశించారు. ప్రస్తుతం జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉన్నారు. తమ ఎమ్మెల్యేలకు ఇతర పార్టీలు గాలం వేయకుండా జేఎంఎం - కాంగ్రెస్ పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తమ కూటమి ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించాయి. రేపటి వరకు వారంతా ఇక్కడే ఉండనున్నారు. సోమవారం బలనిరూపణ సమయానికి వారంతా నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు.
జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్కు 17, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్కు చెరొక ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక బీజేపీ బలం 26 కాగా, ఏజేఎస్యూకు 3, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంల్ కూటమికి 48 మంది సభ్యులు ఉండగా.. ప్రతిపక్ష పార్టీలకు 31 మంది సభ్యుల బలం ఉంది. అయితే డిసెంబర్ 31న మనీలాండరింగ్ స్కాంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడంతో జార్ఖండ్లో రాజకీయం హీటెక్కింది. నాటకీయ పరిణామాల మధ్య చంపై సోరెన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మరోవైపు ఈ బలపరీక్షలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బలపరీక్షకు హజరయ్యేందుకు అనుమతించాలంటూ రాంచీ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం అనుమతించింది. రూ.600 కోట్లకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్‌ను బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆయనకు 5 రోజుల ఈడీ కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం ఆయన రాంచీ జైలులో ఉన్నారు.