Hemant Soren : రాంచీ బాట పట్టిన సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు..త్వరలో నాయకత్వ మార్పు?
X
జార్ఖండ్‌లో అనూహ్యా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలో నాయకత్వ మార్పు జరగనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని ఆదేశాలు వచ్చాయి. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. అటు జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మలుపుతిరిగాయి. సోరెన్ సతీమణికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా రాంచీకి చేరుకున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు రేపు వీరంతా సీఎం నివాసంలో సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు ఉన్నట్లు చెప్పాయి.
అంతేగాక ఈ విషయం పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యేలను రాంచీకి పిలిచినట్లు చెప్పారు. మాకు అందిన సమాచారం ప్రకారం..హేమంత్ తన సతీమణి కల్పనా సోరెన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఈడీ విచారణతో సీఎం భయపడుతున్నారని...తాను రోడ్డు మార్గంలో ఢిల్లీ నుంచి రాంచీకి వస్తానని తన పార్టీ నేతలకు సోరెన్ చెప్పినట్లు తెలిసిందని దూబే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హేమంత్ గత వారం రాంచీ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు ఈడీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆయనను విచారించేందుకు సోమవారం ఢిల్లీలోని అధికారిక నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. అయితే, రాత్రి వరకు వేచిచూసినప్పటికీ సోరెన్ అక్కడికి రాలేదు. దీంతో సీఎం బీఎండబ్ల్యూ కారు, మరో బ్యాగును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్నది ఇంకా తెలియలేదు. రాంచీ నుంచి ఆయన తిరిగిన ప్రైవేటు విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని ఆయన ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఆయనను విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.