Karnataka High Court: డీకే శివకుమార్కు కర్నాటక హైకోర్టు షాక్
X
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు కర్ణాటక హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన అక్రమాస్తుల కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అంతేకాకుండా మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణపై ఉన్న స్టేను ఎత్తేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల్ని కలిగి ఉన్నారంటూ డీకే శివకుమార్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇప్పటికే ఈ కేసులో డీకేను సీబీఐ విచారించింది. అయితే అప్పట్లో కర్ణాటకలో ఎన్నికలు రావడంతో సీబీఐ విచారణపై స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా.. విచారణపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా కేసు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ పిటిషన్ కొట్టేస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది.