Home > జాతీయం > దేవగౌడ మనవడికి హైకోర్టు షాక్..

దేవగౌడ మనవడికి హైకోర్టు షాక్..

దేవగౌడ మనవడికి హైకోర్టు షాక్..
X

కర్నాటకలో జేడీఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నిక చెల్లదని కర్నాటక హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు కోర్టు ధ్రువీకరించింది. దీంతో ప్రజ్వల్ ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.

మూడో అతి చిన్న వయస్కుడైన ఎంపీ అయిన 33 ఏళ్ల ప్రజ్వల్‌.. ప్రస్తుత లోక్సభలో జేడీఎస్‌ తరఫున ఉన్న ఏకైక ఎంపీ కావడం విశేషం. కర్నాటక మాజీ మంత్రి హెచ్‌.డీ రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో హసన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆయన నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేశారంటూ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. హసన్‌ నియోజకవర్గ ఓటరు జి. దేవరాజె గౌడతో పాటు అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి ఎ.మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

రెండు పిటిషన్లపై విచారణ జరిపిన కర్నాటక హైకోర్టు.. ప్రజ్వల్‌ రేవణ్ణ అఫిడవిట్‌లో ఆస్తులను పూర్తిగా వెల్లడించలేదని తేల్చింది. ఆ కారణంగా ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. మరోవైపు ప్రజ్వల్‌ అనర్హతతో హసన్‌ నుంచి తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అతనిపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నందున హసన్‌ స్థానం నుంచి ఎంపీగా ప్రకటించలేమని స్పష్టం చేసింది. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన ప్రజ్వల్‌ తండ్రి రేవణ్ణ, ఆయన సోదరుడు సూరజ్‌పైనా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ప్రజ్వల్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేసిన మంజు కొన్నాళ్ల క్రితం బీజేపీని వీడి జేడీఎస్లో చేరడం విశేషం.


Updated : 1 Sept 2023 7:00 PM IST
Tags:    
Next Story
Share it
Top