Home > జాతీయం > Karni Sena: సుఖ్‌దేవ్‌ సింగ్‌‌ను చంపిన దుండగుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Karni Sena: సుఖ్‌దేవ్‌ సింగ్‌‌ను చంపిన దుండగుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Karni Sena: సుఖ్‌దేవ్‌ సింగ్‌‌ను చంపిన దుండగుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
X

రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో ఇద్దరు సుఖ్‌దేవ్‌ సింగ్‌పై కాల్పులు జరిపిన వాళ్లు కాగా, మరో వ్యక్తి ఈ హత్య కోసం నిందితులకు సహకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని తాము అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ తెలిపారు. నిందితులు రాజస్థాన్‌లోని జైపూర్ నివాసి రోహిత్ రాథోడ్, హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి నితిన్ ఫౌజీ గా పోలీసులు గుర్తించారు. వీరికి సహకరించిన మరో వ్యక్తి ఉద్ధమ్‌ సింగ్‌గా నిర్ధారించారు.

సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి ఈ నెల 5న జైపూర్‌లోని శ్యామ్‌నగర్‌లో తన నివాసంలో కాల్చి చంపబడ్డాడు. సుఖ్‌దేవ్ సింగ్ తో మాట్లాడాల్సి ఉందని, భద్రతా సిబ్బంది అనుమతితో లోపలికి వెళ్లిన ముగ్గురు దుండగులు.. సుఖ్‌దేవ్‌ సింగ్‌తో మాట్లాడుతున్నట్టుగా నటించి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కుటుంబసభ్యులు సుఖ్‌దేవ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. ముగ్గురు దుండగుల్లో ఒకడైన నవీన్‌ షెకావత్‌ సహచరుల కాల్పుల్లో మరణించాడు. ఈ కేసు విచారణ చేపట్టిన రాజస్థాన్ పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు 11 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి నిందితులను నిరంతరాయంగా ట్రాక్‌ చేశామని, చివరికి చండీగఢ్‌లో వాళ్లు పట్టుబడ్డారని రవీంద్ర యాదవ్ తెలిపారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత నిందితులు ముగ్గురిని రాజస్థాన్‌ పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు.




Updated : 10 Dec 2023 12:40 PM IST
Tags:    
Next Story
Share it
Top