'కవచ్' ఉంటే ఒడిశా రైలు ప్రమాదం తప్పేదా?
X
బాలాసోర్ రైలు ప్రమాదంపై ఒక్కపక్క తీవ్ర సంతాపం, మరోపక్క తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి హైటెక్ యుగంలోనూ ఇంత ఘోరమైన ప్రమాదాలు బాధాకరమని, రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రమాదానికి కారణమయ్యే రైల్వే క్రాసింగ్లను యుద్ధప్రాతిపదిన విజయవంతంగా తొలగిస్తున్న రైల్వే శాఖ సిగ్నలింగ్ వ్యవస్థలో తడబడుతోందని, దీనికి బాలాసోర్ ప్రమాదం ఉదాహరణ అని విమర్శలు వస్తున్నాయి. రైళ్లు ఢీకొట్టకుండా నివారించే ‘కవచ్’ రక్షణ వ్యవస పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి వుంటే ఈ ప్రమాదం జరిగేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి ఆటోమేటిక్ టెక్నాలజీతో పనిచేసే కవచ్ శక్తిమంతంగా పనిచేస్తుందని ఇప్పటికే ఎన్నో ప్రయోగాల్లో రుజువైంది.
ఏమిటీ కవచ్?
ట్రైన్ కొల్లిజన్ ఎవాయిడెన్స్ సిస్టమ్, ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను కవచ్ అని వ్యవహరిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నా, మానవ తప్పిదాలు దొర్లినా కవచ్ పసిగట్టి రైలు పైలెట్లకు సిగ్నల్ పంపుతుంది. రైలు రెడ్ సిగ్నల్ జంప్ చేసినా ఆపేస్తుంది. రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే ఢీకొట్టుకోకుండా 400 మీటర్ల దూరంలో ఆగిపోతాయి. ట్రాకుపై రైలుకు ప్రమాదం జరిగితే, మరో రైలు ఆ ట్రాకుపై రాకుండా నిలువరిస్తుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన కవచ్‌కు సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 (SIL4 ) సర్టిఫికెట్ కూడా ఉంది. 10వేల ఏళ్లలో ఒక్కసారి మాత్రమే ఇది విఫలం కావొచ్చని అంటున్నారు.
కవచ్‌ను 2022లో అందబాటులో తీసుకొచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని 65 రైళ్లలో, 1445 కి.మీ. మార్గంలో 134 స్టేషన్లో దీన్ని అమల్లోకి తెచ్చారు. మరో 1200 కి.మీ.లో అమలు చేయాల్సి ఉంది. రైళ్ల వేగం అంతకంతకు పెరుగుతుండడంతో దీన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఢిలీ-ముంబై, హౌరా-ఢిల్లీ మార్గాల్లో దీన్ని అమలు ప్రక్రియ కొనసాగుతోంది.