పదవుల కోసం పార్టీలు చీలుస్తున్నారు..కేసీఆర్.. ఆ పార్టీని ఉద్దేశించేనా?
X
మహారాష్ట్రను కూడా తెలంగాణలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో తమ పార్టీని మహారాష్ట్రతోపాటు ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా దేశమంతటా విస్తరిస్తామన్నారు. ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలకు గులాంబీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న మహరాష్ట్రకు, తెలంగాణకు పేగు బంధముందని, మహారాష్ట్ర ప్రజలు తమ పార్టీని ఆదరించాలని కోరారు. సోలాపూర్‌లో త్వరలో భారీ సభ నిర్వహిస్తామన్నారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు.
‘‘కొందరు పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. పదవుల కోసం విలువలకు తిలోదకాలిస్తూ సొంత పార్టీలనే చీలుస్తూ వేరే పార్టీల్లోకి వెళ్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాలను దేశం దేశం జాగ్రత్తగా గమనిస్తోంది. రైతుల జీవితాలల్లో వెలుగు నింపడానికి వస్తున్న బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్ర ప్రజలు సాదరంగా ఆహ్వానించాలి’’ అని కోరారు. దేశం వెనకబాటుతనానికి కేంద్రంలో అధికారం చలాయిస్తున్న పార్టీలే కారణమని మండిపడ్డారు. కనీస అవసరాలు కూడా తేర్చలేని అలాంటి పార్టీలను ఎందుకు భరించాలని ప్రశ్నించారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఇటీవల పార్టీని చీల్చి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఆ పార్టీని ఉద్దేశించే మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.