కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్..అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
X
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తల్లడిల్లుతున్నారు. వరుణుడి ఉగ్రరూపంతో ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. సుమారు రూ.785 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు తాజాగా అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బుధవారం సోన్‌ప్రయాగ్ , గౌరీకుండ్ దగ్గర ప్రయాణికులను నిలిపివేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తమ సర్కార్ అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని నాలుగు హైవేలను మూసివేశారు. కొండచరియలు విరిగిపడటంతో 10 లింక్ రోడ్లును బ్లాక్ చేశారు. మరోవైపు కుంభవృష్టితో మందాకిని, అలకనంద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పీడబ్ల్యూడీ టీమ్‌లు రెడీగా ఉన్నాయి.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్త ఏర్పాట్లపై సీఎం ధామి మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఏడాది వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక వర్షపాతం వల్ల కొండచరియలు విరిగిపడతాయి, నదుల నీటిమట్టం పెరుగుతోంది. అందుకే అందరం అలర్ట్ మోడ్‌లో ఉన్నాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు , విపత్తు నిర్వహణలో ఉన్నవారు తమ పనిని సజావుగా చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. ఇతర సంస్థలు కూడా మాతో పనిచేస్తున్నాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ , పిడబ్ల్యుడి డిపార్ట్‌మెంట్ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాయి. మేము నిరంతరం ప్రజలతో టచ్‌లో ఉంటున్నాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని ఆదుకుంటాము" అని సీఎం తెలిపారు.