ఆకస్మిక వరదలు.. కేదార్నాథ్ యాత్ర నిలిపివేత
X
ఉత్తరాఖండ్ ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. గౌరీకుండ్ సమీపంలోని దాట్ పులియా వద్ద ఆకస్మిక వరద కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గల్లంతయ్యారు. వరద నీటిలో 3 దుకాణాలు కొట్టుకుపోయాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆకస్మిక వరదలపై సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, కొండ చరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గంలో గౌరీకుండ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది గల్లంతయ్యారు. భారీ శకలాలు కొండ దిగువన ఉన్న దుకాణాలపై పడటంతో అవి మందాకిని నదిలోకి పడ్డాయి. అక్కడ ఉన్నవారంతా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఆ మార్గంలో వెళ్తున్న వారిని వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.