Arvind Kejriwal : కోర్టు ముందుకు కేజ్రీవాల్.. విచారణలో ఏం జరిగిందంటే?
X
లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం (ఫిబ్రవరి 17) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ పలుమార్లు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇటీవల న్యాయస్థానం కూడా సమన్లు జారీ చేసింది. అయితే ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్న కారణంగా.. నేటి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని కేజ్రీవాల్ కోర్టును కోరారు. తర్వాత విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని, ఈసారికి వర్చువల్ గా హాజరయ్యే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం.. తర్వాత విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇప్పటి వరకు ఇచ్చిన నోటీసులకు కేజ్రీవాల్ స్పందించకపోవడంతో.. ఈడీ కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ వర్చువల్ గా కోర్టు ముందు హాజరయ్యారు.
శుక్రవారం (ఫిబ్రవరి 16) ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విపక్ష ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని అన్నారు. వారిపై తప్పుడు కేసులు బనాయించి పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం చేస్తోందని అన్నారు. మద్యం పాలసీ కేసు సాకుతో ఆప్ నాయకులను అరెస్టు చేయాలని భావిస్తున్నారని అన్నారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని, చెక్కుచెదరలేదని ప్రజలకు చూపించేందుకే తాను విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని అన్నారు.
కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. ఆర్థిక అవకతవలకు పాల్పడ్డారంటూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా విచారణకు రావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేయగా.. ఆయన అనేక కారణాలు చూపుతూ విచారణకు హాజరు కాలేదు. దీంతో త్వరలోనే ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు వెళ్లనుండటం సంచలనం రేకిత్తిస్తోంది.