ముఖ్యమంత్రిపై గవర్నర్ సంచలన ఆరోపణలు
X
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం పినరయి విజయన్ తనపై భౌతిక దాడి చేయించే కుట్ర పన్నారని మండిపడ్డారు. సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లేందుకు తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ కాన్వాయ్ను ఎస్ఎఫ్ఐ కార్యకర్తల వాహనాలు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం గవర్నర్ ఆరిఫ్.. ఈ ఘటన వెనుక సీఎం పినరయి విజయన్ హస్తం ఉందని ఆరోపించారు. ఆరిఫ్ మహ్మద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మధ్యలో వేరే కార్లు వచ్చేందుకు అనుమతిస్తారా, అసలు సీఎం కాన్వాయ్ కు సమీపంలోకి మరోకారును రానిస్తారా అని ప్రశ్నించారు. కానీ తన విషయంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు తన కాన్వాయ్ మధ్యలోకి వచ్చి నల్లజెండాలు ప్రదర్శించారని, కారును రెండు వైపుల నుంచి వారి కార్లతో ఢీకొట్టారని ఆరోపించారు. పోలీసులు అలర్ట్ కావడంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు. సీఎం విజయన్ గూండాలను పంపి ఇదంతా చేయించారని.. తనపై దాడికి కుట్ర పన్నారని మండిపడ్డారు. కేరళలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.