టమాటా డబుల్ సెంచరీ.. ఒక్కోచోట కిలో రూ. 250
X
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో ‘తినడం మానేస్తా.. కానీ, టమాటా మాత్రం కొనను’ అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు చాలామంది. గత కొన్ని రోజులుగా సెంచరీ మీదున్న కిలో టమాటా.. ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది. దేశ వ్యాప్తంగా కొన్ని చోట్ల ట్రిపుల్ సెంచరీకి చేరువయింది. దాంతో సామాన్య ప్రజలు ముక్కన వేలేసుకుని ఇంటి దారి పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కిలో టమాటా రూ. 100-150 మధ్య ఉండగా, ఉత్తర భారతంలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం (జులై 7) ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి, యమునోత్రిలో కిలో టమాటా ధర రికార్డ్ స్థాయిలో రూ. 250 పలికింది. ఉత్తరాకాశీలో కిలో రూ.180-200 పలుకుతోంది. మొన్నటి వరకు తీవ్ర ఎండల కారణంగా ఉత్పత్తి తగ్గిందని చెప్పిన అధికారులు.. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో ధరలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. కాగా, తాజాగా కోల్ కతాలో కిలో పచ్చి మిర్చీ ధర రూ.350కు చేరుకుంది.