వృద్ధురాలి హత్య.. పోలీసులకు పట్టించిన ‘‘కింగ్ కోహ్లీ’’..!
X
విరాట్ కోహ్లీపై అభిమానం.. నిందితులను హత్య కేసులో పట్టించింది. బెంగళూరులోని మహాలక్ష్మీపురంలో కమలమ్మ (82) అనే వృద్ధురాలి హత్య కేసును ‘కింగ్ కోహ్లి’ పేరు ఆధారంగా ఛేదించారు పోలీసులు. మే27న కమలమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ముగ్గురు దుండగులు.. నగలు, డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి.. ఆమెను హత్య చేశారు.
దొంగతనానికి నెంబర్ ప్లేట్ లేని ఆటోలో వచ్చారు నిందితులు. దాంతో పోలీసులకు మొదట ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే, నిందితులు వాడిన ఆటో వెనుకాల ‘కింగ్ కోహ్లి’ అనే నేమ్ ప్లేట్ ఉన్నట్లు గమనించిన పోలీసులు.. ఆకోణంలో దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన రోజు కమలమ్మ ఇంటి సమీపంలో అంజనా మూర్తి అనే వ్యక్తి.. కింగ్ కోహ్లీ అనే నేమ్ ప్లేట్ ఉన్న ఆటోకు నంబర్ ప్లేట్ తొలగిస్తూ కనిపించాడు. ఇదంతా సీసీటీవీలో చూసిన పోలీసులు.. నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ఇలా విరాట్ కోహ్లీ పోలీస్ కేసు చేదించడంలో సాయపడ్డాడు. ఐపీఎల్ లో బెట్టింగ్ చేయడంవల్ల అప్పులపాలైన సిద్దరాజు, అశోక్, అంజనా మూర్తి.. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.