లలన్ సింగ్ రాజీనామా.. జేడీయూ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్
X
బిహార్‌లో అధికార జేడీయూలో నాయకత్వ మార్పు జరిగింది. పార్టీ కొత్త అధ్యక్షుడిగా సీఎం నీతీశ్ కుమార్‌ను ఎన్నుకొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో క్షణాల వ్యవధిలోనే నీతీశ్ మళ్లీ పార్టీ పగ్గాలు అందుకున్నారు.
ఢిల్లీ వేదికగా రెండ్రోజుల పాటు జరిగే జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో లలన్ సింగ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ కొత్త చీఫ్గా నితీశ్ కుమార్ పేరును ఆయనే ప్రతిపాదించారు. దీనికి పార్టీ నేతలు ఓకే చెప్పడంతో నితీశ్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పినట్లు జేడీయూ నేత కేసీ త్యాగి ప్రకటించారు.
నిజానికి లలన్ సింగ్ జేడీయూ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నితీశ్‌కు ముఖ్య సలహాదారుడిగా ఉన్న లలన్.. కొంతకాలంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు దగ్గరయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇది కాస్తా నితీశ్-లలన్ సింగ్ మధ్య విభేదాలకు దారితీయగా.. ఈ క్రమంలోనే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేడీయూలో నెలకొన్న పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
జేడీయూ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. 2003లో జనతాదళ్‌లోని శరద్ యాదవ్ వర్గం, లోక్ శక్తి పార్టీ, సమతా పార్టీ కలిసి జనతా దళ్ యునైటెడ్‌గా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి 2016 వరకు శరద్ యాదవ్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్.. నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగారు. 2020లో ఆర్పీ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా.. ఏడాదికే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నీతీశ్‌కు అత్యంత నమ్మకస్తుడైన లలన్ సింగ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించారు.