శృంగార సమ్మతి వయసుపై లా కమిషన్ కీలక సూచన..
X
పోక్సో చట్టంపై లా కమిషన్ కీలక సూచనలు చేసింది. శృంగారానికి అంగీకారం తెలిపే కనీస వయసును 18ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనలను వ్యతిరేకించింది. పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న వయసును మార్చడం సరికాదని కేంద్రానికి నివేదిక సమర్పించింది. వయస్సు 16 ఏళ్లకు తగ్గిస్తే అది బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాపై జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదికలో తెలిపింది.
ఇక పోక్సో చట్టంలో పలు సవరణలను లా కమిషన్ సూచించింది. 16 -18 ఏళ్ల పిల్లలకు సంబంధించిన కేసుల్లో ఇద్దరూ ఇష్టంతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే.. ఆ కేసుల్లో శిక్షలు విధించేటప్పుడు న్యాయస్థానాలు విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. అది కౌమారదశలోని అనియంత్రిత ప్రేమనా..? లేక క్రిమినల్ ఉద్దేశాలు ఉన్నాయా అని గుర్తించడంలో కోర్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని లా కమిషన్ సూచించింది.
ఇలా కాకుండా పరస్పర అంగీకార వయస్సును తగ్గించడం వల్ల చట్టం దుర్వినియోగం అవుతుందని.. నిజమైన కేసులకు హాని కల్గిస్తుందని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
కాగా ప్రస్తుతం శృంగార కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయస్సు 18 ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలో 18 ఏళ్లలోపువారితో లైంగిక చర్యలకు పాల్పడటం నేరంగా పరిగణస్తారు. ఒకవేళ వారి అంగీకారంతో పాల్గొన్నా అది నేరమే. దీనిపై న్యాయస్థానాలు చట్టంలో మార్పులు తీసుకరావాలని వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే లా కమిషన్ వయస్సును తగ్గించడం మంచిది కాదని.. పలు సవరణలు చేస్తే సరిపోతుందని చెప్పింది.