మందుబాబులకు షాక్..వాటికి అధిక ట్యాక్స్!
X
మందుబాబులకు సర్కార్ షాకిచ్చింది. త్వరలోనే మద్యం ధరలను పెంచనున్నట్లు తెలిపింది. పలు కేటగిరీల మద్యానికి పన్ను స్లాబులను సవరించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఆ వివరాలను ప్రకటిస్తామని తెలిపింది. దానివల్ల బీర్లతో పాటుగా ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే ప్రీమియం బ్రాండ్ల ధరల్లో కూడా స్వల్పంగా తగ్గుదల ఉండనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ..బీరు, ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) ధరలను పెంచాలని ప్రతిపాదించారు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడేలా ధరలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐఎంఎల్, బీర్లకు పన్ను స్లాబులు సవరించనున్నట్లు వెల్లడించారు. కొత్త పన్ను స్లాబ్‌లు అమల్లోకి వస్తే బీర్‌తో పాటుగా ఇతర మద్యం బాటిళ్లు ఖరీదైనవిగా మారే అవకాశం ఉందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ అధిక ఆదాయ సేకరణే లక్ష్యంగా రూ.38,525 కోట్లను నిర్ణయించినట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
ప్రీమియం మద్యం ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు అక్కడ మద్యం కొనుగోలు చేసి కర్ణాటకకు తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారన్నారు. స్లాబులుగా మారిస్తే ప్రీమియం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. ఇకపోతే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో ఎంఆర్పీ ధరపై కూడా పన్ను ఎక్కువగానే ఉందని, మద్యం వాస్తవ ధరపై గరిష్టంగా 83 శాతం వరకూ పన్ను విధిస్తున్నట్లు తెలిపారు.