Home > జాతీయం > పాకిస్థాన్లో పుట్టి.. బీజేపీని ముందుకు నడిపి..

పాకిస్థాన్లో పుట్టి.. బీజేపీని ముందుకు నడిపి..

పాకిస్థాన్లో పుట్టి.. బీజేపీని ముందుకు నడిపి..
X

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం "భారతరత్న" అందజేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరొందిన అద్వానీ కొన్ని దశాబ్దాల పాటు పాలిటిక్స్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం వయోభారం కారణంగా ఆయన ఇంటికే పరిమితమైనా దేశానికి అద్వానీ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయాయి.

1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతంలో జన్మించారు ఎల్కే అద్వానీ. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించిన ఆయన.. 14ఏండ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఆర్ఎస్ఎస్ లో చేరారు. అనంతరం లా డిగ్రీ పొందారు. 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్లో చేరిన అద్వానీ.. 1970లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1972 డిసెంబరులో భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ఎల్కే అద్వానీ జైలుకు వెళ్లారు.

1977లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వంలో అద్వానీ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో అటల్ బిహారీ వాజ్ పేయితో కలిసి బీజేపీ పార్టీ ఏర్పాటు చేశారు. 1989లో న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టారు. 1986-90, 1993-98, 2004-2005 మధ్య మూడుసార్లు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. 1998 నుండి 2004 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా అద్వానీ హోం మంత్రిగా వ్యవహరించారు. అనంతరం అద్వానీ డిప్యూటీ పీఎంగానూ పనిచేశారు. 1999లో ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అద్వానీకి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ప్రదానం చేసింది.

అయోధ్యలో రామమందిర పోరాటంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి అద్వానీ, మురళీ మనోహర్ జోషి ముందుండి నడిపించారు. ఎల్‌కే అద్వానీ నేతృత్వంలో 1990 లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్యలోని రామ జన్మభూమి వరకు బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. మందిర్ వహీ బనాయేంగే నినాదంతో అద్వానీ రామమందిర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మురళీ మనోహర్ జోషి కూడా ఈ రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు. బీహార్ లో ఆ యాత్రను అడ్డుకున్న లాలూప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అద్వానీని అరెస్ట్ చేసింది.

1991లో అద్వానీ గుజరాత్ లోని గాంధీనగర్, న్యూఢిల్లీ ల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు. 2009లో ఆరోసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన.. ఆ ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 15 డిసెంబర్ 2009న జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా మారారు. 2014లో 16వ లోక్ సభకు ఎన్నికైన ఎల్కే అద్వానీ ఆ తర్వాత పదవులన్నింటీకీ రాజీనామా చేశారు. వయోభారం కారణంగా క్రియాశీలకు రాజకీయాలకు దూరమయ్యారు.

Updated : 3 Feb 2024 9:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top