లోకో పైలెట్ అప్రమత్తత.. వందేభారత్కు తప్పిన పెను ప్రమాదం..
X
వందే భారత్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. లోకో పైలెట్ అప్రమత్తత భారీ ప్రాణనష్టం జరగకుండా కాపాడింది. ఉదయ్ పూర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న మార్గంలో గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలపై రాళ్లు, ఇనుప రాడ్లు పెట్టడాన్ని గమనించిన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశాడు. దీంతో రైలు పట్టాలు తప్పే ప్రమాదం నుంచి బయటపడింది. ప్రధాని నరేంద్రమోడీ చిత్తోడ్ఘడ్ పర్యటన రోజునే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.
సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్రమోడీ ఉదయ్ పూర్ - జైపూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించారు. ఈ రైలు 6 గంటల్లో దాదాపు 435 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గమ్యానికి చేరుకుంటుంది. సోమవారం జైపూర్ నుంచి ఈ ఎక్స్ప్రెస్ ఉదయ్ పూర్ కు బయలుదేరింది. ఉదయం 9.55గంటల సమయంలో చిత్తోడ్ ఘడ్ ప్రాంతానికి రైలు చేరుకుంది. గాంగ్రార్ - సోనియానా స్టేషన్ల మధ్య పట్టాలపై ఏదో ఉన్నట్లు గమనించిన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు.
లోకో పైలెట్ దగ్గరకు వెళ్లి చూడగా పట్టాలపై పెద్ద పెద్ద బండరాళ్లతో పాటు ట్రాక్ జాయింట్ల మధ్య ఫీటు పొడవైన ఇనుప రాడ్ గుర్తించారు. రెండు చోట్ల ఇనుప రాడ్లు ఉన్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది పట్టాలపై ఉన్న రాళ్లతో పాటు ఇనుపరాడ్లను తొలగించారు. అప్రమత్తంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించిన లోకో పైలెట్ను అధికారులు ప్రశంసించారు.
పట్టాలపై రాళ్లు, ఇనుప రాడ్లు పెట్టిన ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను వీలైనంత తొందరగా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
#WATCH | Vande Bharat Udaipur-Jaipur stopped in the Gangarar-Soniyana section due to the placing of some ballast on the track and of two rods, of one foot each, in the joggle plate.
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 2, 2023
(Source: North Western Railway) pic.twitter.com/SE4bwocNfQ