Cinema Piracy: సినిమా పైరసీ చేస్తే తప్పదు మూడేళ్ల జైలు శిక్ష
X
ఐ బొమ్మ, మూవీ రూల్జ్, జియో రాకర్స్.. అంటూ పైరసీ సినిమాలు చూస్తున్నారా..? ఇకపై మీకు ఆ ఛాన్స్ లేదు. సినీ ఇండస్ట్రీలో పైరసీ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైరసీ చేసేవారికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానాగా విధించే సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-2023ను సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ఇదివరకే రాజ్యసభ దీనిని ఆమోదించింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాక చట్టంగా మారనుంది.
పైరసీ కారణంగా దేశంలోని సినీ ఇండస్ట్రీ ఏటా రూ.20వేల కోట్లు నష్టపోతోందని లోక్‌సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు. బిల్లు ఆమోదం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైరసీ అనేది క్యాన్సర్‌లాంటిదని, దానిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ బిల్లు తెచ్చామని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు కఠినమైన కొత్త సెక్షన్లను అందులో జోడించామని తెలిపారు. ప్రస్తుతం భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారని వెల్లడించారు. సినిమా, టీవీ కంటెంట్‌ను ఇక నుంచి వయసులవారీగా వర్గీకరిస్తున్నామని తెలిపారు.
యూఏ కేటగిరీలోUA 7+, UA 13+, UA 16+ గా విభజిస్తూ సెన్సార్ సర్టిపికెట్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. టీవీలో సినిమా ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వనున్నామని చెప్పారు. పాత చట్టం ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ 10ఏళ్ల వరకే చెల్లుబాటు అయ్యేదని, కొత్త బిల్లు చట్టంగా మారాక సెన్సార్ సర్టిఫికెట్ శాశ్వతంగా చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. ఏ సర్టిఫికెట్ పొందిన సినిమాలో మార్పులు చేస్తే యూఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం కొత్త బిల్లులో ఉందని తెలిపారు.