Home > జాతీయం > Harshavardhan: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా…కేంద్ర మాజీ మంత్రి ప్రకటన.!

Harshavardhan: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా…కేంద్ర మాజీ మంత్రి ప్రకటన.!

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బీజేపీ నేత..

Harshavardhan: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా…కేంద్ర మాజీ మంత్రి ప్రకటన.!
X



కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ డాక్టర్ హర్షవర్థన్ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. నిన్న బీజేపీ విడుదల చేసిన 195 ఎంపీ అభ్యర్థుల జాబితాలో హర్ష్ వర్ధన్ పేరు లేదు. ప్రస్తుతం ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన స్థానాన్ని ప్రవీణ్ ఖండేల్ వాల్‌కి కేటాయించారు. ఈ నేపథ్యంలోనే తాను ఎన్నికల రాజకీయాలను వదిలి వైద్య రంగంలోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.

పూర్తి కాలం తన వైద్యవృత్తిని కొనసాగించేందుకు తిరిగి వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన పదవీకాలంలో సాధించిన విజయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోడీకి, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ ముప్పై ఏళ్లుగా అద్భుతమైన కెరీర్ సాగించాను, ఐదు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు ఎంపీగా ఎన్నికల్లో గెలిచాను, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ప్రతిష్టాత్మక పదవుల్ని నిర్వహించాను. ఇప్పుడు నా మూలాల్లోకి తిరిగి రావడానికి వేచి చూస్తున్నా, నా ఈఎన్‌టీ క్లీనిక్ నా పునరాగమనం కోసం ఎదురుచూస్తోంది’’ అంటూ హర్ష్ వర్థన్ ట్వీట్ చేశారు.

‘‘పొగాకు, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా, సరలమైన మరియు సుస్థిరమైన జీవనశైలిని బోధించడానికి’’ తన పనిని కొనసాగిస్తానని ట్వీట్ చేశారు. 50 సంవత్సరాల క్రితం నేను కాన్పూర్‌లోని GSVM మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోసం చేరినప్పుడు, పేద, సామాన్యులకు సహాయం చేయడం, సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 69 ఏళ్ల హర్ష్ వర్ధన్ నేనెప్పుడూ స్వయం సేవక్‌నే అంటూ ‘‘హృదయంలో స్వయంసేవక్’’ అని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం పట్టుబట్టడంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా, రెండు సార్లు కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. పోలియో రహిత భారతదేశాన్ని సృష్టించడానికి, కోవిడ్ మహమ్మారిపై పోరాడటానికి, దేశాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మొదటి అడుగులు వేసే అవకాశం తనకు లభించిందని హర్షవర్ధన్ పేర్కొన్నారు.

ఈఎన్‌టీ డాక్టరైన హర్షవర్థన్‌.. 1993లో తొలిసారి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా నగర్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదే స్థానం నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు (1993, 96, 98, 2003, 2008, 2013) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టారు. 2021లో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. కరోనా సమయంలో దేశంలో వైరస్‌ను కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించారు.


Updated : 3 March 2024 7:58 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top