రాముడు కలలోకి వచ్చాడు.. కాపాడమంటున్నాడు: బీహార్ మంత్రి
X
రాముడు తన కలలోకి వచ్చాడని, మార్కెట్‌లో అమ్ముడుపోకుండా తనను కాపాడమన్నాడంటూ.. బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరోసారి వివాదానికి తెర లేపారు. బీహార్‌లోని రామాపూర్ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, “నా కలలో రాముడు వచ్చి నన్ను ప్రజలు బజారులో అమ్ముతున్నారని... నన్ను అమ్మకుండా కాపాడండి అని చెప్పారు. రామచరిత్ మానస్‌ను "పొటాషియం సైనైడ్"తో పోల్చిన కొద్ది రోజుల తర్వాత.. మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరో సారి వార్తల్లో నిలిచాయి.
కొన్ని రోజుల క్రితం రామచరితమానస్ గ్రంథాన్ని విషపదార్థమైన ‘సైనైడ్’తో పోల్చారు చంద్రశేఖర్. హిందీ దివాస్ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ‘మీకు 50 రకాల వంటకాలను వడ్డించి అందులో పొటాషియ సైనైడ్ కలిపితే మీరు తింటారా ? హిందూ మత గ్రంథాలది కూడా ఇదే పరిస్థితి అని అన్నారు. అది తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పిన ఆయన.. హిందీ రచయిత నాగార్జున, సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా వంటి ప్రముఖులు సైతం ఆ గ్రంథం గురించి ఇలాగే మాట్లాడరని అన్నారు.
కుల వివక్షపై తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు దూషణలకు దిగారని, భౌతిక దాడులకు పాల్పడతామని బెదిరింపులు వచ్చాయని తెలిపారు. రామచరితమానస్ పట్ల తన అభ్యంతరం కూడా ధృడమైందని, ఇది నా జీవితాంతం కొనసాగుతుందని అన్నారు. "రాముడు కూడా శబరి ప్రసాదం తినేవాడు, ఈరోజు శబరి కుమారుడిని ఆలయ ప్రవేశం నిషేధించారు. ఇది విచారకరం. రాష్ట్రపతి, ముఖ్యమంత్రులను కూడా ఆలయాలను సందర్శించకుండా అడ్డుకున్నారు. ఒకవేళ సందర్శిస్తే.. ఆలయాలను గంగాజలంతో శుద్ధి చేస్తారు. శబరి ఆహారాన్ని దేవుడే స్వీకరించాడు.. ఆ దేవుడే కుల వ్యవస్థ పట్ల కూడా అసంతృప్తితో ఉన్నాడు" అని మంత్రి చంద్రశేఖర్ అన్నారు.