Home > జాతీయం > ఆ గిరిజన యువకుడి కాళ్లు కడిగిన సీఎం.. వీడియో వైరల్

ఆ గిరిజన యువకుడి కాళ్లు కడిగిన సీఎం.. వీడియో వైరల్

ఆ గిరిజన యువకుడి కాళ్లు కడిగిన సీఎం.. వీడియో వైరల్
X

ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి(బీజేపీ మనిషి) మూత్ర విసర్జన చేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై చర్యలు తీసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసి జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసింది. అయితే నిందితుడు బీజేపీకి చెందిన వాడిగా కాంగ్రెస్ ఆరోపించగా... బీజేపీ మాత్రం ఆ వ్యక్తితో తమకే సంబంధం లేదని చెబుతోంది.





మరోవైపు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్రంగా స్పందించారు. నిందితుడు ప్రవేశ్ శుక్లా మానవత్వాన్ని మరిచి నీచంగా ప్రవర్తించాడని చెప్పారు. ఇది తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించినట్లుగా చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు. తాజాగా నిందితుడు ప్రవేశ్ శుక్లా ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





ఇక ఈరోజు(గురువారం) బాధిత వ్యక్తిని సీఎం చౌహన్.. స్వయంగా తన ఇంటికి ఆహ్వానించారు. బాధితుడు అయిన దశరత్ రావత్​ ను కుర్చీలో కూర్చొబెట్టి.. అతడి పాదాలను కడిగారు. ఆ నీటిని నెత్తిన చల్లుకున్నారు. అనంతరం బాధితుడికి దండ వేశారు. సన్మానం చేశారు. జరిగిన ఘటన పట్ల తన తరఫున క్షమాపణలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు తనకు దైవంతో సమానమని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎన్నికలు ఉన్నందునే సీఎం చౌహన్ బాధితుడి కాళ్లు కడిగారని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి కొందరు సీఎం గొప్ప గుణాన్ని మెచ్చుకుంటున్నారు.

Updated : 6 July 2023 6:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top