కూరలో 2 టమాటాలు వేశాడని..ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య
X
మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో ఓ వింతైన ఘటన జరిగింది. భార్యకు తెలియకుండా వంటలో టమాటాలు వేయడంతో భర్త చిక్కుల్లో పడ్డాడు. భార్య అలిగి పిల్లలతో సహా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆమె కోసం మూడు రోజులుగా ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించాడు పాపం ఆ యువకుడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. టమాటా ధరలు ప్రజల జేబులకు చిల్లులు పెట్టడమే కాదు, వారి కాపురాలను కూడా కూల్చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో టమాటాల కారణంగా ఓ కుటుంబం కూలీపోయింది. భార్యకు తెలియకుండా వంటలో రెండు టమాటాలు భర్త వాడాడని భార్య అలిగి ఇంట్లోంచి వెల్లిపోయింది. సంజీవ్ బర్మన్ అనే వ్యక్తి పొట్టకూటికోసం స్థానికంగా ఓ టిఫిన్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. మూడు రోజుల క్రితం సంజీవ్ తన భార్యకు చెప్పకుండా వంటలో రెండు టమాటాలు వేశాడు. ఆ తరువాత భార్యకు ఈ విషయం తెలిసి భర్తతో గొడవకు దిగింది. అతడిపై అగ్గిమీద గుగ్గిలమైంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే భర్తపై అలిగిన భార్య తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. భార్య ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. చివరకు సంజీవ్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.