బలప్రదర్శనలో అజిత్ పవార్‌దే పై చేయి.. శరద్ పవార్ వద్ద14 మందే..
X
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ విచ్ఛిన్నం తర్వాత అజిత్ పవార్, శరాద్ పవార్ వర్గాలు నేడు బలప్రదర్శనకు దిగాయి. ఎమ్మెల్యేల బలప్రదర్శనలో అజిత్ పవార్ పై చేయి సాధించాడు. ఆయన సమావేశానికి 29 మంది ఎమ్మెల్యేలతో పాటు ఐదుగురు ఎమ్మెల్సీలు వచ్చారు. శరద్ పవార్ సమావేశానికి కేవలం 14 మంది ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు హాజరై తమ మద్దతు పలికారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెండు సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే.
సీఎం కావాలని ఉంది
బలప్రదర్శన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. తమకు శరద్ పవార్ స్పూర్తి అని చెప్పారు. ప్రభుత్వంలో ఏ పదవినైనా నిర్వహించే సామర్థ్యం ఎన్సీపీకి ఉందన్నారు. 2004లో కాంగ్రెస్ కంటే ఎన్సీపీకి ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవి కోల్పోయమని అజిత్ పవార్ తెలిపారు. 2019లో శివసేనతో ప్రభుత్వాన్ని శరద్ పవార్ కోరుకోలేదన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం కొన్ని ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది అని అజిత్ పవార్ తన మనసులో మాట బయట పెట్టారు.
మీరు రిటైర్ అవుతున్నారా? లేదా?
తమకు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని అజిత్ పవార్ ప్రకటించారు. బీజేపీలో నేతలు 75ఏళ్లకే పదవీవిరమణ తీసుకుంటారు. మరి మీరు (83 ఏళ్ల శరద్ పవార్‌ను ఉద్దేశిస్తూ) ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ స్థాపించాం. రాష్ట్రానికి ఓ బలమైన నేత కావాలన్నారు.