Home > జాతీయం > ప్రభుత్వ ఆస్పత్రి డీన్​తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ

ప్రభుత్వ ఆస్పత్రి డీన్​తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ

ప్రభుత్వ ఆస్పత్రి డీన్​తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ
X

ప్రభుత్వ ఆస్పత్రి డీన్​తో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు ఓ ఎంపీ. ఈ ఘటన మహారాష్ట్ర నాందేడ్​లోని శంకర్రావ్ చవాన్​ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. రెండ్రోజుల క్రితం ఆ ఆస్పత్రిలో చోటుచేసుకున్న వరుస మరణాలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 48 గంటల వ్యవధిలోనే ఆ ఆస్పత్రిలో 31 మంది మృత్యువాత పడటం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, బాధితుల కుటుంబాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న షిండే సర్కార్.. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు.. శివసేన షిండే వర్గానికి చెందిన నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ తాజాగా ఆ ఆస్పత్రిని సందర్శించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆస్పత్రి డీన్‌ శ్యామ్‌రావ్ వాకోడేను పిలిపించి అపరిశుభ్రతపై గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా డీన్‌తోనే మరుగుదొడ్లను శుభ్రం చేయించారు ఎంపీ హేమంత్​. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

డీన్ టాయిలెట్‌ను క్లీన్ చేస్తున్నప్పుడు ఎంపీ అక్కడే ఉండి, పైప్‌‌తో నీళ్లు పట్టాడు. . ఎంపీ పైపుతో గోడలపై నీళ్లు కొడుతుండగా.. డీన్‌ వైపర్‌తో మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ అందులో కనిపించారు. సోమవారం ఇదే ఆస్పత్రిలో 24 గంటల్లోనే 24 మరణాలు సంభవించాయి. మంగళవారానికి ఆ సంఖ్య 31కి చేరింది. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ మరణాలకు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరత కారణం కాదని చెప్పారు ఆస్పత్రి డీన్ శామ్‌రావ్‌. రోగులకు సరైన వైద్యం అందించినా వారు కోలుకోలేదని తెలిపారు.

అయితే మరణాల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రచారానికి వేల కోట్లు ఖర్చు చేస్తుంది, కానీ పిల్లలకు మందులు కొనడానికి డబ్బు లేదా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. కాగా.. మృతులపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేసినట్లు మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మైసేకర్ తెలిపారు.




Updated : 4 Oct 2023 1:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top