ఆమె అందాన్ని చూసే రాజ్యసభకు పంపారు.. ఎమ్మెల్యే నోటి దురుసు
X
ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన ఎమ్మెల్యే ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi)పై... మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందాన్ని చూసి ఆదిత్య థాకరే ఆమెను రాజ్యసభకు పంపారంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శిర్సత్ వ్యాఖ్యలపై ప్రియాంక తీవ్రంగా స్పందించారు. ‘ నేను ఎలా ఉన్నానో .. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. ఇవి మహిళల హుందాను దిగజార్చేలా ఉన్నాయి. వారి అభిప్రాయాలను గౌరవించండి ’అని ట్విట్ చేశారు. తన ఆత్మను అమ్ముకున్న ద్రోహి శిర్సత్ అంటూ విరుచుకుపడ్డారు. రాజకీయాలు, మహిళలపై తనకున్న పాడుబుద్ధిని శిర్సత్ బయటపెట్టేసుకున్నారని అన్నారు.
ఆదిత్య థాకరే(Aaditya Thackeray) కూడా శిర్సత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఇంత కుళ్లిన మనస్తత్వం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో ఎలా నిలదొక్కుకున్నారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన శిర్సత్ మాట మార్చారు. ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే గతంలో ప్రియాంక చతుర్వేది గురించి తనతో చెప్పిన విషయాన్నే తాను చెప్పానని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌ను వీడిన ప్రియాంక 2019లో ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray) సారథ్యంలోని శివసేన పార్టీలో చేరారు.