Home > జాతీయం > మోదీపై కామెంట్స్.. ముగ్గురు మంత్రులపై వేటు

మోదీపై కామెంట్స్.. ముగ్గురు మంత్రులపై వేటు

మోదీపై కామెంట్స్.. ముగ్గురు మంత్రులపై వేటు
X

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై మాల్దీవులు ప్రభుత్వం వేటు వేసింది. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్లను మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేసింది. మరియం షియునా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. ఆమె వ్యాఖ్యలతో మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది.

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లోపర్యటించారు. ఈ సందర్భంగా సముద్రం ఒడ్డున కూర్చొని కాసేపు సేద తీరారు. అంతేకాకుండా సముద్రంలో స్నార్కెలింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీటిపై మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆ పోస్టులను డిలిట్ చేసింది.

ప్రధాని మోదీపై మంత్రి మరియం షియునా చేసిన వ్యాఖ్యలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కూడా తీవ్రంగా ఖండించారు. ఆమె ఉపయోగించిన భాష దారుణమైందని అన్నారు. మాల్దీవుల శ్రేయస్సు కోసం పనిచేయడంలో భారత్ మంచి ఫ్రెండ్ అని వ్యాఖ్యానించారు. షియూనా వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని భారత్కు స్పష్టమైన హామీ ఇవ్వాలని అక్కడి ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో ముగ్గురు మంత్రులపై మాల్దీవులు ప్రభుత్వం వేటు వేయడం గమనార్హం.


Updated : 7 Jan 2024 7:06 PM IST
Tags:    
Next Story
Share it
Top