రాజీనామాపై వెనక్కి తగ్గిన మణిపూర్ సీఎం!
X
జాతుల హింసను అరికట్టలేకపోయారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ప్రజల నుంచి ఆయన చాలా మద్దతు లభిస్తుండడంతో పదవిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇంకా రాలేదు. బీరేన్ రాజీనామా సమర్పించడానికి శుకవ్రారం ఉదయం గవర్నర్ నివాసానికి బయల్దేరుతుండగా ఆయన ఇంటి వద్ద జనం పెద్ద సంఖ్యలో మానవహారంగా ఏర్పడి రాజీనామా చేయొద్దని కోరారని మంత్రి వెల్లడించారు. రాజీనామా లేఖ చిరిగిపోయిన దృశ్యాలు మీడియాలో వచ్చాయి.
మరోవైపు అల్లర్లను అదుపు చేయడానికి భద్రతా బలగాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. తాజాగా కాంగ్ పోక్పీ జిల్లాలో సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు, ఇద్దరు నిరసనకారులు చనిపోయారు. పలుప్రాంతాల్లో భారీ స్థాయిలో ఆయుధాలు, బాంబులు దొరికాయి. మెయిటీ, కుకీ తెగల మధ్య నెల రోజులుగా సాగుతున్న ఘర్షణల్లో 130 మంది చనిపోగా, వేలమంది గాయపడ్డాడు. కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. మెయిటీలకు ఎస్టీ హోదా కల్పించకూడదని నాగా, కుకీ తెగల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.