మణిపుర్‌లో అల్లర్లలో కొత్త కోణం.. లబోదిబోమంటున్న ముస్లింలు.. మీకు దండం పెడతాం..
X
సెంచరీ డేస్ పూర్తి చేసుకున్న మణిపుర్ అల్లర్లు ఇంకా అదుపులోకి రావడం లేదు. 150 మందిని బలితీసుకుని, వేలమందిని గాయాలపాలు చేసిన మైతేయుల, కుకీల ఘర్షణలను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. ఘర్షణల్లో ఆ రెండు వర్గాలకే కాకుండా వారితో సంబంధంలేని ముస్లింలు కూడా నష్టపోతున్నారు. అడకత్తెరలో పోక చెక్కలా ఇరుక్కుపోయామని, రెండు వర్గాలు వెంటనే హింసకు స్వస్తి పలకాలని కోరుతున్నారు. హింస భారీ స్థాయిలో చెలరేగిన చుర్‌చంద్రపూర్, బిష్ణుపూర్ జిల్లాల్లో నిత్యం బాంబు దాడులు, కాల్పులు జరుగుతుండడంతో అక్కడి ముస్లింలు భీతిల్లిపోతున్నారు. మణిపుర్‌లోని 32 లక్షల జనాభాలో 9 శాతం మంది ముస్లింలు ఉన్నారు.
చుర్‌చంద్రపుర్, బిష్ణుపూర్ జిల్లా మధ్యలోని 35 కి.మీ. 9 ప్రాంతంలో ముస్లిలం జనాభా పెద్ద సంఖ్యలో ఉంది. వీరిని స్థానికంగా మైతేయీ పాంగాల్స్ అని పిలుస్తుంటారు. అక్కడి క్వాట్కా పట్టణ జనాభాలో 90 శాతం మంది ముస్లింలే. కుకీలకు, మైతేయులకు మధ్య సాగుతున్న గొడవలు ఆ పట్టణానికి కూడా పాకాయి. ఈ నెల 6న ముగ్గురు చనిపోయారు. కుకీలే చంపేశారని మైతేయులు ఆరోపిస్తున్నాయి. ఎవర్ని ఎవరు చంపుకున్నా అల్లర్ల వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ముస్లింలు వాపోతున్నారు.
‘‘అల్లర్లను అదుపు చేయడానికి వచ్చిన భద్రతా బలగాలు రెండు రోజులు మా మసీదులో ఉన్నాయి. మేం వారికి నచ్చజెప్పి పంపేశాం’’ అని జమాతే హింద్ కార్యకర్త సలావుద్దీన్ కాసిజీ చెప్పాడు. అల్లర్లతో సంబంధం లేకపోయినా ఇరువర్గాల కాల్పుల మధ్య తాము చిక్కుకుపోతున్నామని, బతుకు కష్టమైందని నాసిర్ ఖాన్ అనే ముస్లిం ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నిత్యావసరాల ధరలు భారీ పెరుగుతున్నాయి. జీవనోపాధి కోల్పోయాం. బతుకు దుర్భరంగా మారింది. బాంబు దాడుల వల్ల పిల్లలను స్కూళ్లకు పంపడం లేదు. వారి చదువులు పాడయ్యాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. మైతేయులు, కుకీలు వెంటనే శాంతి కుదుర్చుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మైతేయీ పాంగాల్స ముస్లింలు మొరపెట్టుకుంటున్నారు. మైతీయులకు ఎస్టీ హోదా కల్పించే అంశంపై కసరత్తు మొదలు కావడంతో కుకీలు ఆందోళన చేయడం, భారీ స్థాయిలో అల్లర్లు చెలరేగడం తెలిసిందే.