Home > జాతీయం > Manipur Violence : మణిపుర్​లో మళ్లీ చెలరేగిన హింస.. కాల్పుల్లో నలుగురు మృతి

Manipur Violence : మణిపుర్​లో మళ్లీ చెలరేగిన హింస.. కాల్పుల్లో నలుగురు మృతి

Manipur Violence : మణిపుర్​లో మళ్లీ చెలరేగిన హింస.. కాల్పుల్లో నలుగురు మృతి
X

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. దౌబాల్ జిల్లాల్లోని లిలోంగ్‌ ఏరియాలో సోమవారం గుర్తుతెలియని కొందరు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. లిలాంగ్ చింగ్జీవ్ ప్రాంతానికి భద్రతా బలగాలను పోలిన దుస్తులు ధరించిన దుండగులు వచ్చి ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి దగ్గర డబ్బులు దోచుకోవడానికి నిందితులు కార్లలో వచ్చారని, అది వాగ్వాదానికి దారితీసినట్లు చెప్పారు. దుండగులను స్థానికులు తరమికొట్టారని, ఆ సమయంలో పారిపోతూ వారు కాల్పులు జరిపినట్లు తెలిపారు.

ఈ ఘటన తర్వాత లోయలోని తౌబాల్‌, ఇంఫాల్‌ ఈస్ట్‌, ఇంఫాల్‌ వెస్ట్‌, కక్చింగ్‌, బిష్ణుపూర్‌ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. కొందరు వ్యక్తులు ఆయుధాలతో వచ్చారని స్థానికులు పేర్కొన్నారు. తాజా హింసను ఖండించిన సీఎం బీరేన్‌ సింగ్‌.. ప్రజలు శాంతి పాటించాలని పిలుపునిచ్చారు. తాజా ఘటన నేపథ్యంలో ఆయన మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలోనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై లిలాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ కూడా స్పందించారు. సంబంధిత అధికారులు తనకు పరిస్థితిని తెలియజేశారని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతను కూడా పటిష్ఠం అదేశించారు.రెండు రోజుల క్రితం మణిపూర్‌ సరిహద్దు పట్టణమైన మోరేలో అనుమానిత తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.




Updated : 2 Jan 2024 9:58 AM IST
Tags:    
Next Story
Share it
Top