మణిపూర్‌లో పోలీసుల ఆయుధాలను దోచేస్తున్నారు..
X
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసకారులు రెచ్చిపోతుండడంతో హింస హెచ్చుమీరుతోంది. అల్లరి మూకలు ఆయుధాలతో దాడులకు దిగుతున్నాయి. గ్రామాల్లోకి ప్రవేశించి ఇళ్లకు అగ్గిపెడుతున్నారు. ఇప్పటికే వందలాది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు నిరసనరకారుల చేతుల్లో భారీగా ఆయుధాలు కనిపించడం ఆందోళన రేకెత్తిస్తోంది. మైతేయ్, కుకీ వర్గానికి చెందిన ఇరు వర్గాలు భారీగా ఆయుధాలను దోచి ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. ఇప్పటివరకు చోరీకి గురైన ఆయుధాల సంఖ్య సుమారు 4,537 వరకు ఉంటుందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. మణిపుర్ పోలీస్ కాలేజ్ నుంచి 446, మణిపుర్ రైఫిల్స్ నుంచి 1,598, ఎనిమిది ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ల నుంచి 463 ఆయుధాలను నిరసనకారులు ఎత్తుకెళ్లారు. వాటిలో 1600 ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకోగా..మిగిలనవి అల్లరిమూకల వద్ద ఉన్నాయి. మొత్తం మణిపుర్‌లో 37 ప్రాంతాల్లో ఈ దోపిడీకి పాల్పడ్డారు. దొంగిలించిన ఆయుధాల్లో ఎల్‌ఎంజీ, ఎంఎంజీ, ఏకే, ఇన్సాస్, అసాల్ట్ రైఫిల్స్, ఎంపీ5, స్నైపర్, పిస్తోల్, కార్బైన్‌లు ఉన్నాయి.
మే నెల నుంచి రావణ కాష్టం లా మణిపూర్ రగిలిపోతోంది. ఎస్టీ స్టేటస్ కోసం డిమాండ్ చేస్తున్న మైతీ వర్గానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కుకీ వర్గం నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే మైతీ, కుకీల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇటీవల ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.