మణిపూర్ హింసలో 152 మంది మృతి : Amit Shah
X
మణిపూర్ హింసపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మణిపూర్ హింసాత్మక ఘటనలు సిగ్గుచేటని తాము అంగీకరిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. కానీ దీనిపై విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని.. ఇది మరింత సిగ్గుచేటన్నారు. మణిపూర్లో హింసాత్మ ఘటనలు తమను ఎంతో బాధించాయని చెప్పిన షా.. అక్కడ జరిగిన అల్లర్లలో 152మంది మరణించినట్లు చెప్పారు. ఈ అల్లర్లపై 1106 కేసులు నమోదవ్వగా.. 14,898 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వైరల్ వీడియోపై అమిత్ షా స్పందించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా.. పోలీసులకు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఈ వీడియోను కావాలని కొందరు వైరల్ చేశారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ అంశాన్ని రాజకీయం చేశారని మండిపడ్డారు. తాను మూడు రోజులు మణిపూర్ లోనే ఉండి పరిస్థితిని సమీక్షించానని చెప్పారు. తమ సహయమంత్రి 23 రోజుల పాటు మణిపూర్‌లో ఉండి పరిస్థితులను పర్యవేక్షించారన్నారు.
మయన్మార్, మిజోరం నుంచి కుకీ ఆదివాసీ శరణార్థులు మణిపుర్‌లోకి వస్తున్నట్లు షా చెప్పారు. వారు వేలాదిగా తరలిరావడంతో వేరే వర్గాల్లో అభద్రతాభావం నెలకొందని.. దీంతో మెయితీ, కుకీల మధ్య ఘర్షణలకు దారి తీసినట్లు వివరించారు. ‘‘మణిపుర్ ఘటనల నేపథ్యంలో సీఎస్, డీజీపిని బదిలీ చేశాం. సీఎంను ఎందుకు తొలగించలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం బీరెన్ సింగ్ సహకరిస్తున్నందునే ఆయన్ను పదవి నుంచి తొలగించలేదు. సైనికుల పహారాతో మణిపుర్‌లో పరిస్థితులు చక్కడుతున్నాయి’’ అని షా తెలిపారు.