దేశాన్నిరక్షించా.. కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాను.. రిటైర్డ్ ఆర్మీ సైనికుడు
X
మణిపూర్ లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి, వారిని నగ్నంగా ఊరేగిస్తూ తీసుకెళ్లిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఘటనపై ఓ బాధిత మహిళ భర్త(65) మీడియాతో ఫోన్ లో మాట్లాడారు. తన కళ్ల ముందే తన భార్యతో పాటు మరో ఇద్దరు మహిళలను లాక్కెళ్లారని చెప్పారు. ఆ అల్లరి మూకని అడ్డుకొని వాళ్లను రక్షించేందుకు వెళ్లిన ఓ అమ్మాయి తండ్రిని దారుణంగా చంపేశారని తెలిపారు. ఆయుధాలు పట్టుకొని మహిళలను బట్టలు విప్పాలని బెదరించారని.. ప్రాణాలు కాపాడుకునేందుకు వారు ఆ గ్యాంగ్ చెప్పినట్టే చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వందల మంది మగాళ్ల మధ్య తన భార్యతోపాటు మరో మహిళను నగ్నంగా చేశారని బాధపడ్డారు. తాను ఆర్మీలో పనిచేశానని చెప్పిన ఆయన.. కార్గిల్, శ్రీలంకలో యుద్ధ సమయాల్లో దేశాన్ని రక్షించానని, కానీ కుటుంబాన్ని కాపాడుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. జరిగిన ఘటనతో తన భార్య డిప్రెషన్‌లోకి వెళ్లిందని, సాధారణ స్థితికి రావడానికి చాలా కష్టపడుతోందని చెప్పాడు.
కార్గిల్‌లో జరిగిన యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తూ పోరాడిన తాను.. రిటైర్మెంట్ అయ్యాక స్వంత నివాస స్థలం కూడా యుద్ధభూమి కంటే ప్రమాదకరంగా తోచిందన్నారు. మే 3 ,4 తేదీలలో, వేలాది మంది గుంపు తమ ప్రాంతంలోని తొమ్మిది గ్రామాలపై దాడి చేసి, ఇళ్ళు, చర్చిని తగులబెట్టారని, పెంపుడు జంతువులను చంపారన్నారు. ఇళ్లను తగలబెట్టడంతో, గ్రామస్థులందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అటు ఇటు పరిగెత్తారని, ఆ సమయంలోనే తన భార్య తన నుండి విడిపోయిందన్నారు. ప్రాణభయంతో సమీపంలోని అడవిలో చేరి దాక్కున్న ఆమెను పట్టుకొచ్చి మరీ చిత్రహింసలు పెట్టారన్నారు.