Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి పలు రైళ్లు రద్దు
X
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన సికింద్రాబాద్-విజయవాడ ల మధ్య ఈరోజు నుంచి ఈ నెల 18(వచ్చే సోమవారం) వరకూ పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నారు అధికారులు. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్‌లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నారు. వాటిలో ప్రయాణికులు విరివిగా వినియోగించే ప్రధాన రైళ్లు కూడా ఉన్నాయి. ఈ నెల 10 నుంచి 18 వరకు గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లను ఆపేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
కాగా, డిసెంబర్ 5వ తేదీ నుంచే ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్, కాజీపేట-డోర్నకల్ పుష్‌పుల్ రైళ్లను రద్దు చేశారు అధికారులు. ఇక ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలును కేవలం గుంటూరు నుంచి కాజీపేట వరకే నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.