కొని పెట్టుకోండి.. ఉల్లి ధరలు పెరగబోతున్నాయ్
X
ప్రస్తుతం.. వినియోగదారులంతా కన్నీళ్లు తెప్పించే ఉల్లే ఇంత కూల్ గా ఉంటే.. టమాట ఏంటబ్బా ఇంత ఉరికి పడుతుంది అనుకున్నారు. దానికి కారణం మార్కెట్ లో టమాటా రేటు కొండెక్కడమే. అయితే, టమాటతో పోటీ పడేందుకు ఉల్లి కూడా సిద్ధం అయినట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. జులై నెలలో ఉల్లి రేటు సెంచరీ కొట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనంతటికి కారణం.. వర్షాల వల్ల ఉల్లి సాగు దెబ్బ తినడమే కాకుండా.. ఉల్లి నిల్వలు కూడా వేగంగా తగ్గిపోవడమే.
ప్రస్తుతం హైదరాబాద్ సహా అన్ని రిటైల్ మార్కెట్స్ లో రూ. 100కు ఆరు కిలోల ఉల్లిని అమ్ముతున్నారు. కొన్ని చోట్ల వందకు పది కిలోలు కూడా ఇస్తున్నారు. అయితే, ప్రస్తుతం అమ్ముతున్నదంతా పాత స్టాక్. ఇది ఒక నెల రోజుల్లో అమ్ముడుపోతుంది. కొత్త స్టాక్ మార్కెట్ లోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. దాంతో డిమాండ్ పెరిగి సప్లై తగ్గే సరికి.. ఉల్లి ధరకు రెక్కలొచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా.. 2022- 23లో 2.51 లక్షల టన్నుల ఉల్లిని నిల్వ చేసిన కేంద్రం.. 2023-24కల్లా కనీసం 3 లక్షల టన్నుల ఉల్లిని నిల్వ చేయాలని చూస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. రాబోయే నెలల్లో ఉల్లి రేటు కచ్చితంగా పెరిగే అవకాశం ఉంది.