రణరంగంగా మారిన యూనివర్సిటీ.. సిగరెట్లు తాగొద్దన్నందుకు చితకొట్టుకున్నారు
X
గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వ గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, 33 మంది సెక్యూరిటీ గార్డుల మధ్య ఆదివారం రాత్రి ఘర్షణ చెలరేగింది. సిగరెట్లు తాగొద్దన్నందుకు విద్యార్ధులు యూనివర్శిటీని రణరంగంగా మార్చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి గార్డులను విద్యార్థులను అదుపులోకి తీసుకుని పిరస్థితిని అదుపు చేశారు.
యూనివర్సిటీ క్యాంపస్‌లోని మున్షీ ప్రేమ్‌చంద్ హాస్టల్‌లో కొందరు విద్యార్థులు సిగరెట్ తాగడంపై సెక్యూరిటీ గార్డులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో స్టూడెంట్స్, సెక్యూరిటీ మధ్య మాట మాట పెరిగింది. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడతో పోలీసుల బృందం విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తుతం సీనియర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొంత మందిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.